అమరావతి ముంపుకు కొండవీటి ఎత్తిపోతలు చెక్

సాధారణంగా సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతల పథకంలను చేబడతారు. కాని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తున్న అమరావతిని ముప్పు ప్రమాదం నుండి కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండవీటి వాగు ఎత్తిపోతల పధకాన్ని చేపట్టింది. . ప్రకాశం బ్యారేజిని ఆనుకుని గుంటూరు జిల్లా ఉండవల్లిలో కృష్ణా కరకట్ట సమీపంలోనే ఎత్తిపోతల నిర్మించారు.

 డ్రై రన్‌ కూడా విజయవంతమవడంతో సెప్టెంబర్‌ 10 లేదా సెప్టెంబర్‌ 14న ఈ ఎత్తిపోతలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మొత్తం 16 పంపులతో, 16 మోటార్లతో సిద్ధమయిన ఈ ఎత్తిపోతల... కొండవీటి వాగు వరదలో  5000 క్యూసెక్కులను కృష్ణా నదిలోకి ఎత్తిపోయనుంది.

అమరావతికి వరద ముంపును తప్పించి ఆ నీటిని తిరిగి నదికి లేదా కాలువకు మళ్లించ్చే విధంగా నిర్మించారు.  దేశంలోనే ఈ తరహా పథకం ఇంతకు ముందెప్పుడూ నిర్మించలేదు.

అమరావతి ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల్లోని పంటలను కొండవీటి వాగు వరద ప్రవాహం ముంపునకు గురిచేసేది. ఇప్పుడు ఆ సమస్యకు  కొండవీటి వాగు ఎత్తిపోత ద్వారా పరిష్కారం లభించింది. వరద ఎక్కువగా వచ్చినపుడు ఆ నీటిని  కృష్ణా నదితో పాటు బకింగ్‌ హామ్‌ కాలువకు మళ్లించటం ద్వారా రాజధాని ప్రాంతం  ముంపునకు గురికాకుండా ఉండేలా ఏర్పాటు చేశారు.

రూ.222.44 కోట్ల రూపాయతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ బాధ్యతలను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నిర్మాణంలో సంస్థ ఎదుర్కొన్న సవాళ్లలో  ప్రధానమైంది నీటి ఊట. ఎత్తిపోతల పథకం మూడు వైపులా నీళ్లు  నిండి ఉన్నాయి. ఒకవైపు కృష్ణా నది, మరోవైపు బకింగ్‌ హామ్‌ కాలువ, మరోవైపు కొండవీటి వాగు. 365 రోజులు మూడు వైపులా నీరు నిల్వ ఉండే చోట ఈ ఎత్తిపోతల నిర్మాణ బాధ్యతలను ఎంఈఐఎల్‌ చేపట్టింది.

వర్షాలు పడినపుడు, ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు ఎక్కువ ఉన్నపుడు, బకింగ్‌ హామ్‌ కాలువకు నీటిని ఎక్కువగా వదిలినపుడు నీటి ఊట సమస్య మరింత ఎక్కువయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు 24X7 గంటలు  జనరేటర్లను ఉపయోగించి 25 మోటార్లతో నీటిని ఎత్త్తిపోసింది.

అమరావతికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం 29.5 కిలోమీటర్ల మేర కొండవీటి వాగు ద్వారా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర వాగులు, వంకల నీరు కూడా ఇందులోనే చేరుతుంది. లామ్‌ ఆనకట్ట వద్ద ప్రారంభమైన ఈ కొండవీటి వాగు మేడికొండూరు, తాడికొండ, మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ప్రవహిస్తూ ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ ద్వారా కృష్ణానదిలోకి చేరుతుంది. ప్రవాహాలు కొద్దిగా ఉన్నప్పుడు, వరద లేనప్పుడూ సమస్య లేదు. కృష్ణా లో వరద ఉన్న సమయంలో... ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలో కొండవీటి ప్రవాహం కలవకుండా వెనక్కి ఎగబాకుతుంది.

యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తి చేయడంతో ప్రస్తుతం విజయవాడ నగరం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారిక నివాసం, తాత్కాలిక సచివాలయానికి రాకపోకలు సాధించేందుకు ప్రధాన రహదారిగా ఉన్న  కరకట్టను  పునరుద్దరించారు. డిశ్చార్జి పాయింట్‌, కరకట్ట మధ్యన, కరకట్ట, పంప్‌ హౌస్‌ మధ్యన ఉన్న ఖాళీ స్థలాన్ని అందమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు. డిశ్చార్జి పాయింట్‌ నుంచి కృష్ణా నది అందాలను సందర్శకులు తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.