ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు: జగన్

ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు వీలు కలిగించే విధంగా టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదని స్పష్టం చేశారు. బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు. ఇక నుంచి  ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.

కాగా వైఎస్‌ జగన్‌ గతంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు.

ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రిత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వం సేవలు అందుతున్నాయా.? లేదా అన్నదానిపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి అభిమానాన్ని చూరగొనాలని సీఎం ఆదేశించారు.

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం. ఈ రాకెట్‌లో వైఎస్సార్‌సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్‌ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి' అని స్పష్టం చేశారు.