మమతా సర్కార్ కూలే వరకు చేరికలు

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి బిజెపిలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ టీఎంసీ ఎమ్మెల్యే, దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ప్రెసిడెంట్‌ లిపికా రాయ్‌తో పాటు పలువురు జెడ్పీ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తొలిసారి బిజెపి చేతికి ఓ జిల్లా పరిషత్‌ చిక్కినట్లైంది.

దీనిపై బిజెపి  ముఖ్య నేత ముకుల్‌ రాయ్‌ స్పందిస్తూ.. ఇది ‘ట్రైలర్‌ మాత్రమే.. అసలు కథ ముందుంది’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలు కేవలం తొలి విడత మాత్రమేనని మున్ముందు మరింత మంది చేరతారని తెలిపారు. మమత ప్రభుత్వం కూలే వరకు ఈ చేరికలు కొనసాగుతూనే ఉంటాయని భరోసా వ్యక్తం చేశారు. అన్ని విడతల చేరికలు పూర్తయ్యే సరికి రాష్ట్రంలో టీఎంసీ మూలాలే ఉండవని స్పష్టం చేశారు. 

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో  దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా కొంతమంది నేతల్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తోంది. దీంతో పదవులు కోల్పోయిన వారంతా పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మిత్రా అనే నాయకుడు మాట్లాడుతూ.. పార్టీలో చాలా మంది నేతల్ని బయటి వ్యక్తులుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనని నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించారని దయ్యబట్టారు. పార్టీ మారిన మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఎంసీ వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అందుకే నాయకులు పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పుంజుకోవడంతో ప్రారంభమైన చేరికలు ఇప్పటికీ కొనసాగుతుండడం మమతా బెనర్జీని కలవరపెట్టే అంశం. మరోవైపు తాజా చేరికల సందర్భంగా ముకుల్‌ రాయ్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.