నియంతృత్వంపై ప్రజాస్వామ్యమే గెలుస్తుంది

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితిని ప్రతిఘటించిన వారందరినీ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్మరించుకున్నారు. ఈ ఘటనతో భారత ప్రజాస్వామ్య విలువ, గొప్పతనం నిరూపితమైందని కొనియాడారు. ఎప్పటికైనా నియంతృత్వవాదంపై ప్రజాస్వామ్యమే గెలుస్తుందని రుజువైందని మోదీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా.. ఆనాటి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

అలాగే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా కూడా ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. వార్తా పత్రికలపై ఉక్కుపాదం మోపి, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసిన రోజు అది అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆనాటి అధికార పక్షం దేశ ప్రజాస్వామ్యాన్నే హత్య చేసిందని ధ్వజమెత్తారు. ఈ ఘటనతో చెల్లాచెదురైన వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం కోసం అనేక మంది ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చిందని  గుర్తు చేశారు.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఎమర్జెన్సీ నాటి వీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘‘జూన్‌ 25, 1975న ఎమర్జెన్సీ విధింపు, తదనంతర పరిణామాలు దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇలాంటి రోజున మన దేశానికి రక్షణగా నిలుస్తున్న కేంద్ర సంస్థలు, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ట్వీట్ చేశారు.