ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రసక్తే లేదు ... కేంద్రం స్పష్టం

ఇకపై ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని కేంద్రప్రభుత్వం తెల్చి చేప్పేసింది.  ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభలో బిహార్‌కు చెందిన జేడీ (యూ) ఎంపీ కౌసలేంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 

‘‘ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఒడిసా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవు్‌ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.  

గతంలో ప్రణాళిక సహకారంలో భాగంగా ఆయా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇచ్చేది. కొండ ప్రాంతాలు, తక్కువ జన సాంద్రత, ఎక్కువ గిరిజన జనాభా, పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటు, వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హోదా ఇచ్చేవాళ్లు. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక వృద్ధికి నిర్దిష్ట చర్యలేమీ లేవు్‌ అని తన సమాధానంలో వివరించారు.  

హోదా’కు గతంలో ఎన్‌డీసీ (జాతీయ అభివృద్ధి మండలి) సిఫార్సు చేసేదని, అయితే ప్రత్యేకహోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు స్వయంగా ఆర్థిక మంత్రి ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వం అని పార్లమెంటుకు స్పష్టం చేసేశారు.