భారత్ బంద్ కు మమతా దూరం

పెట్రో భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు పట్ల పలు ప్రతిపక్షాలు స్పందించడం లేదు. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ యేతర ప్రతిపక్షాలతో తృతీయ కూటమి ఏర్పాటుకు పావులు కదుపుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ బంద్ కు దూరంగా ఉండటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.

బంద్ పిలుపుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించకపోవడంపై కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ భారత్‌ బంద్‌పై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. మోడీ వ్యతిరేక పక్షాలు సంఘీభావం ప్రకటించ వలసిన సమయంలో ఆమె పార్టీ వేరుగా ఉండటం పట్ల విమర్శలు చెలరేగుతునాయి.

కాగ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రజలపై పెనుభారం మోపుతుండగా, ఇంధనంపై వ్యాట్‌ వసూలు చేస్తూ తృణమూల్‌ సర్కార్‌ పరిస్థితిని మరింత దిగజార్చిందని బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శలు కురిపించారు.

బంద్‌కు పిలుపు ఇచ్చిన అంశాలను తాము సమర్ధిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంటూనే సమ్మెకు తాము వ్యతిరేకమని, భారత్‌ బంద్‌ సందర్భంగా జనజీవనం యధావిధిగా సాగేందుకు అన్ని చర్యలూ చేపడతామని పేర్కొంది. సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పార్థ్‌ ఛటర్జీ వెల్లడించారు.

మరోవైపు భారత్‌ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఎన్‌సీపీ, ఎస్పీ, డీఎంకే  సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దపడుతున్న తెలుగు దేశం పార్టీ కుడా బంద్ కు మద్దతు ప్రకటించలేదు. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి ఆంధ్ర ప్రదేశ్ లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రకటించింది.