ప్రజావేదిక కూల్చివేతతోనే ప్రక్షాళన మొదలు : జగన్

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రజావేదిక కూల్చివేతతోనే అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ చర్యలు మొదలవుతాయని, అవినీతిని ఏమాత్రం సహించనని హెచ్చరించారు.   

‘మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణమేనా?. ఈ భవనం అవినీతి సొమ్ముతో కట్టింది. అక్రమంగా నిర్మించిన భవనమని తెలిసీ ఇక్కడే మనం సమావేశం పెట్టుకున్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా. ప్రక్షాళన ఈ భవనం నుంచే ప్రారంభం కావాలి' అని తెలిపారు. ఎల్లుండి నుంచే ఈ భవనం కూల్చివేత పనులు చేపడతామని, ఇదే ఈ భవనంలో చివరి సమావేశమని పేర్కొంటూ ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దామని జగన్‌ అధికారులకు పిలుపునిచ్చారు.

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలని చెప్పారు.  ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని చేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.  

ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలది కీలక పాత్ర. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయ్యారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ప్రజలు మీదగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించాలని సూచించారు. అవినీతి, దోపిడీ వ్యవహారాలు చేసిన ఈ ప్రభుత్వం సహించదు. ఏ స్థాయిలో ఉన్న సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు,అధికారులు రెండు కళ్లలాంటి వారని చెబుతూ కలెక్టర్లు ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలని, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.  ఈ వర్గాల్లోని ప్రతి అర్హుడిగా సంక్షేమపథకాలు అందించాలని, అందిచకపోతే తప్పు చేసిన వాళ్లం అవుతామని హెచ్చరించారు. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలని, ఆర్థికంగా ఎదిగేలా మన ప్రతి అడుగు వారికి దగ్గరుండాలని అంటూ ఇందుకోసమే నవరత్నాలు ప్రకటించామని పేర్కొన్నారు.   

 ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో  గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్‌ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్‌ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్‌ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నామని వివరించారు. 

అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్‌ చేయవచ్చు. నేరుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 50 ఇళ్ల పరిధే కాబట్టి విచారణకు పెద్దగా ఇబ్బంది ఏర్పడదు. తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం. ఇందులో ఏమాత్రం మొహమాటం పడవద్దని స్పష్టం చేశారు. 

వ్యవస్థను మార్చాలన్నదే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఇది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలి. చెడిపోయిన వ్యవస్థ మారాలని నేను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా. ప్రతి అడుగులోనూ పారదర్శకత కనిపించాలి. ప్రజలు హక్కుగా పొందాల్సిన సేవలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు.  కార్యాలయాల చుట్టూ తిరిగేలా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని హితవు చెప్పారు.