అఖిలేష్ తో బంధం ఇంకెప్పుడు లేన్నట్లే... మాయావతి

లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజావాది పార్టీతో పొత్తును తెంచేసుకొంటున్నట్లు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా ఈ బంధం మారెప్పటికీ ముడిపడి ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసారు. ఇక వచ్చే అన్ని ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మొదట్లో అసెంబ్లీ ఉపఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నా భవిష్యత్ లో అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళి పొత్తు అంశం పరిశీలిస్తామని ఆమె పేర్కొనడం తెలిసిందే. 

గత రాత్రి పార్టీ నేతల సమావేశంలో ఆమె ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ అఖిలేష్ ముస్లిం వ్యతిరేకి అని నిశితంగా విమర్శించారు. తనను ఎక్కువగా ముస్లిం అభ్యర్థులకు సీట్లు ఇవ్వవద్దని చెప్పారని వెల్లడించారు. గతంలో అఖిలేష్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులు చేసే ప్రతికార్యక్రమాన్నీ అడ్డుకున్నారని, అందుకనే దళితులు వారికి ఓటేయలేదని ఆమె ధ్వజమెత్తారు. 

‘ఓట్ల లెక్కింపు రోజు ఫలితాలు వెలువడిన అనంతరం నేను అఖిలేష్‌ యాదవ్‌కు ఫోన్‌ చేశాను. ఆయన నా ఫోన్‌కు స్పందించలేదు. నాతో మాట్లాడలేదు. మా పార్టీ కార్యకర్తలు ఎస్పీకి సహకరించలేదనేది ఆయన భావన. నాకు ఫోన్‌ చేయమని అఖిలేష్‌ను సతీశ్ చంద్ర మిశ్రా కోరారు. అయినప్పటికీ ఆయన నాతో మాట్లాడలేదు. కూటమిగా ఉన్న సమయంలో నా బాధ్యతను నేను 100% నిర్వర్తించాను. ఇక జూన్‌ 3న కూటమి రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అఖిలేష్‌..సతీశ్‌ చంద్రకు ఫోన్‌ చేశారేగానీ నాతో మాట్లాడలేదు' ఆమె విమర్శలు గుప్పించారు. 

ఎన్నికల్లో బీఎస్పీ గెలిచిన 10 స్థానాలు..ఎస్పీ వల్లే గెలిచిందని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారని, ఎస్పీ కార్యకర్తలు తనను అన్నేసి మాటలంటున్నా అఖిలేష్‌ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మాయావతి విరుచుకు పడ్డారు.  సమాజ్‌వాదీ పార్టీకి అండగా ఉండే యాదవ సామాజిక వర్గం కూడా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు పలుకలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఎస్పీ కీలక నేతలు కూడా ఓడిపోయారని చెప్పారు. చివరికి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఓడిపోయారని గుర్తుచేశారు.