ముఖర్జీ మరణంపై దర్యాప్తు జరిపించని నెహ్రు

దేశం మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రు కావాలనే జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాపసాద్ ముఖర్జీ ఆకస్మిక, అనూహ్య మరణంపై దర్యాప్తు జరిపించలేదని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని అమరవీరుల చిహ్నం వద్ద ఢిల్లీ బీజేపీ ఏర్పాటుచేసిన శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవం సందర్భంగా జడ్డా మాట్లాడుతూ జమ్ముకు పూర్తి ఆరోగ్యంతో వెళ్లిన శ్యామాప్రసాద్ ముఖర్జీ కేవలం నెల రోజుల సమయంలో అనూహ్య పరిస్థితుల్లో మరణించటం ఏమిటని ప్రశ్నించారు.

ముఖర్జీ మరణంపై దర్యాప్తు జరిపించాలని ఆయన తల్లితోపాటు దేశంలోని పలువురు ప్రముఖులు, ప్రజలు కోరినా నెహ్రు మాత్రం అందుకు అంగీకరించలేదని నడ్డా ఆరోపణలు కురిపించారు. దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు చట్టాలు ఉండటం ఏమిటి? జమ్ముకు వెళ్లాలంటే పర్మిట్ తీసుకోవటం ఏమిటని ప్రశ్నించిన ముఖర్జీ పర్మిట్ తీసుకోకుండా జమ్ములో అడుగు పెట్టగానే అరెస్టు చేసి శ్రీనగర్ తీసుకెళ్లారని ఆయన చెప్పారు. డాక్టర్ ముఖర్జీ కస్టడీలో ఉండగానే ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారని నడ్డా చెప్పారు.

జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక ప్రధాన మంత్రి, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక పతాకం ఉండటం ఏమిటని నెహ్రును ముఖర్జీ పార్లమెంటులో ప్రశ్నించారని ఆయన తెలిపారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాల మూలంగానే జమ్ముకాశ్మీర్ సుప్రీం కోర్టు, సీఏజీ పరిధిలోకి వచ్చిందని నడ్డా చెప్పారు. ముఖర్జీ ఆశయాల సిద్దికోసం బీజేపీ పనిచేస్తోంది.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ లక్ష్య సాధన కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రకటించారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ చూపించిన బాటలో నడుస్తూ దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని నడ్డా పిలుపిచ్చారు. డాక్టర్ ముఖర్జీ కరుడుకట్టిన జాతీయవాది అని చెబుతూ కేవలం 33 సంవత్సరాల వయస్సులోనే కోల్‌కత్తా విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ పదవిని చేపట్టిన డాక్టర్ ముఖర్జీ విధాన మండలికి ఎన్నికయ్యారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ముఖర్జీ ఆ తరువాత కేంద్రం మంత్రివర్గంలో కొంతకాలం పనిచేశారు. అయితే నెహ్రు దేశ విభజన విధానానికి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారని వివరించారు.

దేశం పట్ల ప్రేమాభిమానాలు నూటికి నూరు శాతం ఉండాలి తప్ప సగం సగం కాదన్న నాయకుడు ముఖర్జీ అని నడ్డా చెప్పారు. ముఖర్జీ జనసంఘ్‌ను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన మహానాయకుడని చెప్పారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి అమిత్ షా, నడ్డా, ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ తదితరులు బీజేపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

దేశ సమైక్యత, సమగ్రత కోసం శ్యామాప్రసాద్ తన జీవితాన్ని బలిదానం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతదేశం పటిష్టంగా, శక్తివంతంగా ఉండాలన్న ముఖర్జీ అభిలాషే దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు బలాన్ని చేకూరుస్తోందని ఆయన చెప్పారు.