జగన్ కు తొమ్మిది నెలలకు 2.17 లక్షల కోట్ల అవసరం!

భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డిని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కలవరానికి గురిచేస్తున్నది. ఈ ఏడాది మిగిలిన తొమ్మిది నెలలకు సుమారుగా రూ.2.17 లక్షల కోట్లు అవసరమౌ తాయని ఆర్థికశాఖ ప్రాధమికంగా  అంచనా వేసింది. రాష్ట్ర ఆదాయం, ఖర్చు, కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు, పథకాల వారీగా వినియోగించాల్సిన మొత్తం, ప్రభుత్వ ప్రాధాన్యతలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.

ప్రాధాన్యతల వారీగా ఏడాదికి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూనే, మిగిలిన తొమ్మిది నెలల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం విడిగా చూపించనుంది. ముఖ్యమంత్రి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో నవరత్నాలతోపాటు అనేక ఇతర హామీలను పేర్కొన్న విషయం తెలిసిందే. వాటిల్లో కొన్ని ఈ ఏడాది, మరికొన్ని వచ్చే ఏడాది ఆరంభంలో అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వాటి అమలుకు కావాల్సిన నిధులపై అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. 

ప్రధానంగా నవరత్నాలకు రూ.66,279 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో  అమ్మఒడి కార్యక్రమానికి రూ.4,914 కోట్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ.5,000 కోట్లు, వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి రూ.7,000 కోట్లు, అన్ని రకాల ఫించన్లకు రూ.14,895 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.8,232 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.6,300 కోట్లు, రైతు భరోసాకు రూ.11,937 కోట్లు, నీటిపారుదలకు రూ.8000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. 

ఇదే సమయంలో కొత్త ఉద్యోగాలు, వివిధ శాఖల పథకాలకు, నిర్వహణకు రూ.38,629 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో  అత్యధికంగా పట్టణాల్లో, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.4,082 కోట్లు అవసరం కాగలవు. అలాగే సున్నా వడ్డీ పథకానికి రూ.4,000 కోట్లు, మార్కెట్‌ స్థిరీకరణకు రూ.3,000 కోట్లు, కాపు, ఇతర కార్పొరేషన్లకు రూ.2,250 కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి, పాఠశాలలు, హాస్టల్‌ భవనాలు, ఆసుపత్రుల భవనాలకు రెండేసి వేల కోట్లు రూపాయలు చొప్పున కేటాయించవలసి ఉంది. 

ఎస్‌సి, ఎస్‌టి కాలనీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.1800 కోట్లు, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీ లేని రుణాలకు రూ.1190 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి వెయ్యి కోట్లు, గ్రామ కార్యదర్శుల ఆరు నెలల జీతాలకు రూ.1814 కోట్లు, గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.1224 కోట్లు, గ్రామ వాలంటీర్లకు రూ.1099 కోట్లుగా ఖర్చును అంచనా వేస్తున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు పెళ్లి కానుకగా రూ.680 కోట్లు, దేవాదాయశాఖ ద్వారా గ్రామ పంచాయితీల్లో సంస్థలకు గ్రాంట్లుగా  రూ.321 కోట్లు, కోల్డ్‌ స్టోరేజిలకు రూ.459 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది. 

సాధారణ అవసరాలకు, రుణాలకు సంబంధిరచి రూ.61 వేల కోట్లు, ఇతర శాఖలకు రూ.16 వేల కోట్లు, జీతాలకు రూ.27,345 కోట్లు, పౌర సరఫరాలకు రూ.2,721 కోట్లు, విద్యుత్‌ రంగానికి నాలుగు వేల కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధికి వెయ్యి కోట్లు కేటాయించేలా ప్రతిపాదిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.340 కోట్లు మాత్రమే అవసరమౌతాయని అధికారులు పేర్కొనడం గమనార్హం. గత ప్రభుత్వం రాజధానికోసం భారీ కసరత్తు చేసి, అదే స్థాయిలో కేటాయింపులు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.