మాయావతి బంధువులకు కీలక పదవులు

వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే బీఎస్పీ అధినేత్రి మాయావతి.. రూట్ మార్చారు. తన బంధువులకు పార్టీలో కీలక పదవులను కట్టబెట్టారు. తమ్ముడు ఆనంద్‌కుమార్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, అల్లుడు ఆకాశ్ ఆనంద్ (24)ను జాతీయ సమన్వయకర్తగా నియమిస్తూ ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. లోక్‌సభలో బీఎస్పీ నేతగా దానిశ్ అలీని, నగీనా ఎంపీ గిరీశ్ చంద్రను లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా నియమించారు. 

మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌ గతంలో కూడా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. అయితే కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయన్న విమర్శలు రావడంతో అప్పట్లో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.   రెండేండ్ల క్రితం చెప్పినట్లే ఆకాశ్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. 

త్వరలో జరిగే 12 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై మాయావతి దృష్టి సారించారు. గతంలో ఉపఎన్నికలకు దూరంగా అనే మాయావతి తొలిసారి పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడానికి సిద్దపడుతున్నారు. కాగా, బీజేపీ ప్రతిపాదిత ఒకే దేశం, ఒకే ఎన్నిక ఆలోచన వెనుక ఒకేసారి ఈవీఎంలను తారుమారు చేసి అన్ని ఎన్నికల్లో గెలుపొందాలన్న ఆలోచన దాగి ఉన్నదని ఆమె ఆరోపించారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం హైజాకింగ్‌కు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. 

కాగా, మాయావతి తన బంధువులకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడాన్ని బీజేపీ ఆక్షేపించింది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ.. కుటుంబపార్టీలేనని అవి దేశానికి, ప్రజలకు గానీ ప్రాతినిధ్యం వహించడంలేదని ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేపీ మౌర్య విమర్శించారు.