టిడిపి విలీన ప్రక్రియపై రాద్ధాంతం..కిషన్ రెడ్డి

బిజెపిలో బిజెపి రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. టిడిపి  విలీన ప్రక్రియపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ టిడిపికి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారని చెప్పారు. ఆ నలుగురు సభ్యులు రాజ్యసభ ఛైర్మన్‌కు విలీన లేఖ ఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. 

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని చెప్పారు. ఏ సభలోనైనా మూడో వంతు సభ్యులు విలీనం చేయాలని కోరితే అది చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు అందించిన తీర్మాన ప్రతులను ఇచ్చిన తర్వాతే ఆ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకున్నామని కిషన్‌రెడ్డి వివరించారు. టిడిపి ఎంపీల చేరికను అంగీకరిస్తున్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారని తెలిపారు. 

గతంలోనూ ఇలాంటి విలీనాలు చాలా జరిగాయని.. ఆ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. నిబంధనల ప్రకారం వేరే పార్టీలో చేరుతామంటే ఆపే అధికారం ఎవరికీ లేదని.. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్‌ రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నారని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో విలీనం చేసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారని టిడిపిని ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టిడిపి అధినేత చంద్రబాబుకు బిజెపిని విమర్శించే అర్హత లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ లో విలీనం అయ్యారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. టిడిపి నుంచి బిజెపిలో చేరిన నలుగురు ఎంపీలపై ఎక్కడా కేసులు, ఛార్జ్‌షీట్‌లు లేవని.. ఆర్థిక పరమైన అంశాల్లో వారిపై ఉన్న ఆరోపణలపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, హోంశాఖకు సంబంధించి తనకు కీలక బాధ్యతలు అప్పగించారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనతో పాటు జమ్ముకశ్మీర్‌ విషయంలో కొన్ని బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖను మార్చాల్సి ఉందని ఆయన తెలిపారు. దీనికోసం వివిధ దేశాల్లో పోలీసు శాఖలను అధ్యయనం చేస్తామని చెప్పారు.