బ్యాంకింగ్‌, బీమా రంగాల్లోకి మరింతగా విదేశీ పెట్టుబడులు

 బ్యాంకింగ్‌, బీమా రంగాల్లోకి మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆహ్వానించడం; పెట్టుబడుల ఉపసంహరణ వేగాన్ని పెంచడం తదితర అంశాలు ఆర్థికవేత్తలతో, పరిశ్రమ నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సమావేశంలో చర్చకు వచ్చాయని తెలుస్తోంది. వచ్చే నెల కేంద్ర బడ్జెట్‌ ప్రకటించనున్న నేపథ్యంలో శనివారమిక్కడ ఈ సమావేశం జరిగింది. వృద్ధిని సాధించడంపైనే దృష్టి సారించినట్లు ఈ చర్చలో ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నీతి ఆయోగ్‌ చేపట్టిన ఈ సదస్సులో 40 మంది ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు.

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌, టాటా స్టీల్‌ గ్లోబల్‌ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్‌, వేదాంతా రిసోర్సెస్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి, పేటీఎమ్‌ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ వంటి పరిశ్రమ దిగ్గజాలతో పాటు.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు శంకర్‌ ఆచార్య, పీఎమ్‌ఈఏసీ మాజీ సభ్యుడు సుర్జిత్‌ భల్లా, ఎన్‌ఎస్‌ఈ సీఈఓ విక్రమ లిమే, నొమురా ముఖ్య ఆర్థికవేత్త సోనాల్‌ వర్మ వంటి ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా పాలుపంచుకున్నారు.

వృద్ధిరేటు పతనం, పడకేసిన పారిశ్రామికోత్పత్తి, నీరసించిన ఉత్పాదక రంగం, మందగించిన ఆటో రంగ అమ్మకాలు, దిగజారిన వినియోగ సామర్థ్యం తదితర ఆర్థిక విపత్కర పరిస్థితుల నడుమ వృద్ధి పురోగతికి ఏం చేయాలనే దానిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆర్థికవేత్తలు, పరిశ్రమ నిపుణులతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా గాడి తప్పిన జీడీపీని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, అవలంభించాల్సిన చర్యలపై చర్చించారు. 

స్థూల ఆర్థికవ్యవస్థ, ఉద్యోగిత, వ్యవసాయం-నీటి వనరులు, ఎగుమతులు, విద్య, ఆరోగ్యం వంటి ఆరు ముఖ్యమైన ఆర్థిక అంశాలపై వీరంతా తమ ఆలోచనలను పంచుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎమ్‌ఓ) తన ప్రకటనలో తెలిపింది. ఉద్యోగ సృష్టికి, ఎగుమతుల ప్రోత్సాహానికి మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం గురించి కూడా చర్చ జరిగింది. 

కాగా, దేశంలో పర్యావరణహిత విద్యుత్‌ వాహనాల కోసం నీతి ఆయోగ్‌ చేపడుతున్న చర్యలను చంద్రశేఖరన్‌ ప్రశంసించారు. బొగ్గు, గనుల రంగాన్ని మరింత సరళీకరించాలని అనిల్‌ అగర్వాల్‌ కోరారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 5.8 శాతానికి పడిపోయిన నేపథ్యంలో మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2018-19) వృద్ధిరేటు గణాంకాలు ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 6.8 శాతానికి పతనమైన విషయం తెలిసిందే.