ఆధిపత్యం చెలాయించడం హిందూ తత్వం కాదు

ఆధిపత్యం చెలాయించడం, పెత్తనం చేయడం హిందూ తత్వం కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. చికాగోలో జరిగిన రెండవ ప్రపంచ హిందూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొని, చారిత్రక ఉపన్యాసం చేశారు. ఆ సభ జరిగి 125 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు వివిధ మతాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

వారిని ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం హిందూ వౌలిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసారు. అన్ని కులాలు, జాతులు ఒకటిగా కలిసి, హిందూ ఐక్యతను చాటాలని పిలుపిచ్చారు. ఇది ఇతరులపై ఆధికారానాన్ని చెలాయించడానికి కాదని వివరించారు. మానవాళి అభ్యున్నతికి హిందువులు కృషి చేయాలని పిలుపిచ్చారు.

ఒంటరిగా ఉంటే సింహంపైన కూడా అడవి కుక్కలు దాడి చేసి చంపుతాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని హితవు చెప్పారు. మెరుగైన ప్రపంచాన్ని కోరుతున్నామని చెబుతూ వసుధైక కుటుంబమే హిందువుల నినాదమని గుర్తు చేసారు. సంప్రదాయాలను పాటించడం అవసరమని స్పష్తం చేసారు. అయితే తాను ఆధునీకరణకు వ్యతిరేకిని కానని లిపారు.

హిందూ ధర్మం అత్యంత సనాతనమైనదేకాకుండా, అత్యంత ఆధునికమైనదని కూడా అని భగవత్ తెలిపారు. ‘సుమంత్రితే సువిక్రంతే’ (సమష్టిగా ఆలోచించు.. గొప్ప విజయాన్ని సాధించు) అనేదే సూత్రం ఆధారంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ విధానమే యావత్ ప్రపంచాన్ని ఒకటి చేస్తుందని చెప్పారు. అహాన్ని అదుపు చేసుకొని, అందరి అభిప్రాయాలనూ గౌరవించడం నేర్చుకుంటే వసుధైక కుటుంబ సాధ్యమవుతుందని తెలిపారు.

యావత్తు ప్రపంచాన్ని ఒక జట్టుగా ఏకతాటిపైకి తేవాలంటే అవసరమైన విలువల్లో ఒకదానిని వివరిస్తూ, మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు, ధర్మరాజు ప్రవర్తించిన తీరును గుర్తు చేశారు. వారెప్పుడూ అహంకారాన్ని అదుపులో ఉంచుకుని, ఏకాభిప్రాయాన్ని అంగీకరించడం నేర్చుకుంటే ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేవచ్చునని సూచించారు. రాజకీయాలకు, యుద్ధనీతికి ప్రతీకగా మహాభారతం నిలుస్తుందని చెప్పారు.

రాజకీయాలను ధ్యానంలా చేయకూడదని భగవత్ వ్యాఖ్యానించారు. హిందూ సమాజంలో అసాధారణ ప్రతిభాపాటవాలున్న వారి సంఖ్య చాలా ఎక్కువని చెప్పారు. వీరంతా ఒకేతాటిపైకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమైతే, పరిస్థితి మరో విధంగా ఉంటుందని చెప్పారు. మూల సూత్రాలను మరచిపోతున్నందువల్లే హిందూ జాతి కొన్ని శతాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నదని భవగత్ గుర్తుచేశారు. హిందువుల ఐక్యత తక్షణ కర్తవ్యమని తెలిపారు.