కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం

కర్ణాటకలో వీలైనంత త్వరగా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని బిజెపి ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితిని తప్పిస్తామని వెల్లడించింది. ఇటీవల మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలు లేకుండానే అధికారంలోకి వస్తామని కర్ణాటక బిజెపి ఇన్‌ఛార్జి మురళీధరరావు పేర్కొన్నారు.'

బెంగళూరులో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో కీచులాటలు, అధికారాన్ని రక్షించుకోవటానికే సంకీర్ణ ప్రభుత్వ నేతలు కాలం సరిపెట్టారు. ఇక రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు? వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని(కుమారస్వామి సర్కార్‌ను) కూల్చి అధికారాన్ని అందుకోవటమే మా లక్ష్యం" అని ప్రకటించారు. 

మైత్రి పేరిట అపవిత్ర పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ రోజు రోజుకీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. వారికి అవసరమున్నపుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్తామంటే 105 మంది ఎమ్మెల్యేలున్న మేమేం చేయాలి?  అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడపలేమనుకుంటే ఆ అవకాశాన్ని మాకివ్వాలని స్పష్టం చేశారు. 

సంకీర్ణ నేతలు స్వార్థం కోసం మళ్లీ ఎన్నికలు రుద్దితే చూస్తూ ఊరుకోం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో తెలియదు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన వెంటనే మిత్రపక్షాలు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాల్సిందని మురళీధరరావు  స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామిపై 90 శాతం ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఇదే సందర్భంగా ధ్వజమెత్తారు.