అత్యాచారం కేసులో కోర్టులో లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ

అత్యాచారం, కిడ్నాప్‌ కేసులో నిందితుడైన బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఎంపీ అతుల్‌ రాయ్‌ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. వారణాసి కోర్టులో శనివారం లొంగిపోయారు. దీంతో ఆయనను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గం నుంచి ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థిగా అతుల్‌ రాయ్‌ బరిలోకి దిగారు. అయితే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఓ మహిళ ఆయనపై కేసు పెట్టారు. తనను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. దీంతో మే మొదటివారంలో అతుల్‌ రాయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారానికి కూడా బయటకు రాలేదు.

మరోవైపు తమ అభ్యర్థిపై బిజెపి కావాలనే తప్పుడు కేసు పెట్టించిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అయితే అతుల్‌ రాయ్‌ ప్రచారం చేయకపోయినా.. ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి హరి నారాయణ్‌పై 1.22లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు గానీ అజ్ఞాతం నుంచి బయటకు రాలేదు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల 17వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజుల్లో కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. అతుల్‌ రాయ్‌ కూడా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా.. అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన లోక్‌సభకు రాలేదు. మరోవైపు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతో అతుల్‌ రాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు అజ్ఞాతం వీడి కోర్టులో లొంగిపోయారు. 

పార్లమెంటరీ నిబంధనల ప్రకారం.. కొత్తగా ఎన్నికైన ఎంపీ లోక్‌సభ తొలి 60 పనిదినాల్లోగా ప్రమాణస్వీకారం చేయాలి. ఆ లోగా ప్రమాణం చేయకపోతే సదరు ఎంపీ తన సభ్యత్వాన్ని కోల్పోతారు.