బీజేపీలో టిడిపి ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదం

టిడిపి ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకపోయినా రాజ్యసభ వెబ్‌సైట్‌లో మాత్రం సుజనాచౌదరి, సీఎంరమేష్‌, టీజీవెంకటేష్‌, గరికపాటి మోహన్‌రావుల పేర్లను బిజెపి జాబితాలోకి చేర్చారు. అలాగే టిడిపి సభ్యుల కింద కనకమేడల రవీంద్రకుమార్‌, తోట సీతారామలక్ష్మిలను మాత్రమే చూపారు. విలీనంపై రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకపోయినా ఆ సభ్యుల విలీనం పూర్తయినట్లేనని రాజ్యసభ వర్గాలు ధ్రువీకరించాయి. 

విలీనాన్ని సవాల్‌చేస్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ శుక్రవారం  వెంకయ్యనాయుడుకి ఇచ్చిన ఫిర్యాదుకు విలువలేదని, అందులో వారు లేవనెత్తిన అంశాల్లో పసలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. పార్టీ విలీనం సంస్థాగతంగా జరగాలని, సభ్యులను సభలవారీగా కాకుండా పార్లమెంటరీపార్టీ మొత్తంగా చూడాలన్న టిడిపి నేతల వాదన చట్టప్రకారం చెల్లదని స్పష్టంచేశాయి. సంస్థాగత విలీనం కేంద్ర ఎన్నికలసంఘం పరిధిలోకి వస్తుందే తప్ప, స్పీకర్‌ పరిధిలోకి రాదన్న విషయాన్ని టిడిపి నేతలు విస్మరించినట్లు పేర్కొన్నాయి. 

సభ్యుల ఫిరాయింపు, విలీనం మాత్రమే సభాధ్యక్షుడి పరిధిలోకి వస్తుందని, అదికూడా  సభ్యులను సభలవారీగా చూడాలి తప్పితే పార్లమెంటరీ పార్టీవారీగా చూడకూడదని 10వ షెడ్యూల్‌లోని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి.

ఇక్కడ బిజెపిలో విలీనం కావడానికి ముందుకొచ్చిన సభ్యులు తమదే నిజమైన తెలుగుదేశం, తమకే సైకిల్‌గుర్తుకావాలి లాంటి డిమాండ్లేమీ పెట్టలేదని, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం నచ్చి తాము అందులో విలీనం కావాలనుకుంటున్నామని  మాత్రమే చెప్పారు కాబట్టి ఇక్కడ సంస్థాగత వివాదాలేమీ లేవని పేర్కొన్నాయి. ఒకవేళ ఎన్నికల గుర్తుకు సంబంధించిన వివాదాలేమైనా ఉంటే అవి ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి తప్పితే  సభాధ్యక్షుల పరిధిలోకి రావని వివరించాయి. 

పార్టీలో చీలికలతో సభాధ్యక్షుడికి సంబంధంలేదని, సభ్యుల ఫిరాయింపులు, విలీనం అంశాలు పదో షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేదా? అన్నది చూడటంవరకే పరిమితం అని అధికారవర్గాలు ఉదహరించాయి. రాజ్యసభ సచివాలయం అన్నింటినీ పరిశీంచి ఆ పరిణామక్రమం అంతా  పదో షెడ్యూల్‌లోని 4వ పేరా కింద ఉన్న నిబంధనల ప్రకారమే ఉన్నట్లు చెప్పడంతో ఆ విషయాన్ని సంబంధిత పార్టీలకు సమాచారం అందించి, అందుకు అనుగుణంగా వెబ్‌సైట్‌లో సభ్యుల పేర్లను మార్చినట్లు చెప్పాయి. 

నిబంధనల ప్రకారం నలుగురి నుంచి  తాజాగా  ఫామ్‌-3 తీసుకున్న తర్వాతే వారిని బిజెపి జాబితాలో చూపినట్లు పేర్కొన్నాయి. అన్ని విషయాలనూ పూర్తి రాజ్యాంగ నిబంధనలతో సరిపోల్చుకున్న తర్వాత, అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే తుది ఆమోదముద్ర వేసినట్లు స్పష్టంచేశాయి. దీనిపై సభలో సభాధ్యక్షుడు అధికారికంగా ప్రకటించడం, బులిటెన్‌ విడుదలచేసే సంప్రదాయాలు గతం నుంచీ ఎప్పుడూ లేవని, అందువల్ల  ఇప్పుడుకూడా అదే సంప్రదాయాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లుపేర్కొన్నాయి.  

ఒకవేళ టిడిపి నేతలు ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇవ్వొచ్చు తప్పితే, విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వడం కుదరని స్పష్టం చేశాయి. శరద్‌యాదవ్‌పై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్య తీసుకున్న అంశాన్ని ఈ విలీనంతో పోల్చడానికి వీల్లేదన్నాయి.  

ఇలా ఉండగా, బిజెపిలో విలీనం అయిన టిడిపి ఎంపీలు సుజనాచౌదరి, సీఎంరమేష్‌, టీజీవెంకటేష్‌లు శుక్రవారం ఉదయం పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. సుమారు 25 నిమిషాలపాటు ఆయనతో మాట్లాడారు. మోదీ నాయకత్వంపైన  నమ్మకంతో తాము బిజెపిలో చేరిన విషయాన్ని వారు ఆయన దృష్టికి తెచ్చారు. వారి నిర్ణయాన్ని ప్రధాని స్వాగతించారు. 

‘‘గతంలో మీరు మంత్రిగా ఎన్డీయేలో కొనసాగాలన్న భావనతో ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయం కారణంగా ఉండలేకపోయారు.. ఇప్పుడు మళ్లీ స్వీయ నిర్ణయం తీసుకొని బిజెపిలో చేరడం సముచిత నిర్ణయం. ఇప్పుడు మళ్లీ మనం అందరం కలిసి పనిచేద్దాం..’’ అని ప్రధాని వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం.