కాళేశ్వరం నిర్మాణంలో బిజెపి పాత్ర కీలకం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర అనుమతులు, మహారాష్ట్ర నుంచి సహకారం అందించడంలో బిజెపి పాత్ర మరువలేనిదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో  టీఆర్‌ఎస్    ఘనత ఎంతో బిజెపిదీ అంతేనని స్పష్టం చేశారు.  కాళేశ్వరం అంచనాలను రూ.30 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని.. పూర్తయ్యే నాటికి అది ఎంతకు చేరుతుందో తెలియదన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను(డీపీఆర్‌) వెబ్‌సైట్‌లో పెట్టాలని.. వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

టీఆర్‌ఎస్  కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలపై బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డాకు వివరించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి క్రిషి సంచాయ్‌ యోజన కింద 11 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు, పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పథకాలకు మరిన్ని నిధులు విడుదలయ్యేలా కేంద్ర మంత్రులకు సూచించాలని నడ్డాను కోరినట్లు లక్ష్మణ్‌ వివరించారు. 

రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను ఓర్వలేకే ఓ కార్యకర్తను హత్య చేశారని.. అక్రమ కేసులు, దాడులను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజాసింగ్‌పై దాడి కేసులో తొలి వీడియోను పోలీసులు విడుదల చేయాలని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించారు.

కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బహుదూర్‌పల్లిలోని అటవీ పరిశోధన కేంద్రానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు లక్ష్మణ్‌ నేతృత్వంలోని బిజెపి బృందం విజ్ఞప్తి చేసింది. వంద ఎకరాల విస్తీర్ణంలోని కేంద్రంలో మంచి పరిశోధనశాల, నిపుణులైన శాస్త్రవేత్తలు ఉన్నారని వివరించారు. 

ఇలా ఉండగా,   టీఆర్‌ఎస్   సర్కారు రజాకర్ల పాలనను తలపిస్తోందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు దిల్లీలో ఫిర్యాదు చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతీభాయి విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు తమపై లాఠీఛార్జి జరిపి తీవ్రంగా గాయపరిచారని, ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి నేతలు, కార్యకర్తలపై అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.