ఢిల్లీ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తాం

ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధిలో తమ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రాంచీలో జరిగిన 'యోగా డే' ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కేజ్రీవాల్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మొహల్లా క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాల్సిందిగా ప్రధాని మోడీని  కేజ్రీవాల్‌ శుక్రవారం ఆహ్వానించారు. అనంతరం కేంద్రానికి సహకరిస్తామని ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్‌ భారత్‌ మినహాయింపు వర్తిస్తుందా లేదా అన్న అంశాన్ని సమీక్షించాలని కోరారు. అలాగే వర్షాకాలంలో యమునా నది జలాలను నిల్వ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికోసం ప్రభుత్వ ప్లాంటును అమలు చేసేందుకు కేంద్రం మద్దతును కోరినట్లు మరో ట్వీట్‌లో తెలిపారు.

కాగా, రెండోసారి ప్రధాని మోడీ అధికారం చేపట్టిన అనంతరం కేజ్రీవాల్‌ మొదటిసారి సమావేశమవడం గమనార్హం. ఈ భేటీలో ఆయుష్మాన్‌ భారత్‌ గురించి చర్చించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య పథకం గురించి వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజెఎవై) పథకం కింద పేద ప్రజలకు రూ. 50 కోట్ల వరకు ఆరోగ్య బీమా అందిస్తుంది.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కన్నా ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య పథకం పది రెట్లు సమగ్రమైనదని గతంతో కేజ్రీవాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, రెండు రోజుల క్రితం జరిగిన అఖిలపక్ష సమావేశానికి కేజ్రీవాల్‌ హాజరుకాలేదు.