యోగా ఆధునిక ఆరోగ్యసాధనం.. అందరికి

మానవాళికి భారతదేశం అందించిన అపూర్వ కానుక, మానసిక, శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా అంతర్జాతీయ వేడుకలను  ప్రపంచ వ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించారు. శుక్రవారం అయిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభాత్‌ తారా మైదానంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నేతృత్వం వహించారు.  దాదాపు 40వేల మంది యోగా అభ్యాసకులతో మోదీ ఆసనాలు వేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...‘‘ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్న ప్రతిఒక్కరికీ అభినందనలు. ప్రతిదేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయి. యోగా ప్రతి ఒక్కరి  జీవితంలో శాంతి అనుభూతి కలుగుజేస్తుంది. ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన ద్వారా మెరుగైన సేవలు అందిస్తాం. యోగా వల్ల సామాన్యులతో పాటు అందరికీ లబ్ధిచేకూరుతుంది. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది" అని పేర్కొన్నారు.

యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్యసాధనం. రోగాలు దరిచేరకుండా యోగా దోహదపడుతుంది. క్రమశిక్షణ, అంకిత భావంతో యోగా పాటించాలి. పురాతన పద్ధతులకు ఆధునిక ఫలితాలు జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని ప్రధాని తెలిపారు. మన దేశంలో రెండు దశాబ్దాలుగా  హృద్రోగ సమస్య పెరుగుతోంది. వ్యాధులకు చికిత్సకంటే.. ముందస్తు నివారణ ముఖ్యం. మారుతున్న కాలంతో పాటు మన దృష్టి ఆరోగ్యంపై ఉండాలని ప్రధాని సూచించారు.

యోగాకు వయస్సు, రంగు, కులం, మతం తేడా లేదు.  యోగాకు సంపన్నులు, పేదలు అనే తేడా లేదు. యోగా అందరిది. యోగా ఎల్లప్పుడూ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. మనమందరం యోగా సాధనను మరో స్థాయికి తీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. అనారోగ్యం వల్లన పేదలే ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతూ యోగాను గ్రామాలకు, పెదలు, గిరిజనుల ఇంటివద్దకు తీసుకు వెళ్లాలని చెప్పారు.