కోడెలకు టిడిపి దూరం... అవినీతి ఆరోపణలలో ఒంటరి!

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్షి సత్తెనపల్లి, నరసరావుపేట లలో `కె టాక్స్' వసూలు చేశారని, విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పదుల సంఖ్యలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసారావు పై వస్తున్న ఆరోపణలు టిడిపి వర్గాలను ఇరకాటంలో పడవేశాయి. ఈ ఆరోపణలతో ఆత్మరక్షణలో పడిన కోడెల తనను కాపాడుకోవడం కోసం ఒంటరి పోరాటం చేయవలసి వస్తున్నది. ఈ విషయంలో టిడిపి నేతలు అందరు మౌనం పాటిస్తున్నారు.

ఈ విషయమై కోడెల కుమారుడు, కుమార్తె లపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తున్నవారు ఎక్కువగా టిడిపికి చెందిన వారే కావడంతో కోడెల పరిస్థితి మరింతగా ఇరుకున పడుతున్నది. గుంటూరు జిల్లా తెలుగు దేశం రాజకీయాలనే సుదీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంతో శాసించిన కోడెల ఇప్పుడు ఒక విధంగా నిస్సహాయంగా మిగిలారు.

ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు సూచించడంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగంగానే వస్తున్నాయని ఒక ప్రతినిధి బృందం డీజీపీకి ఫిర్యాదు చేయాలని రెండురోజుల క్రితం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించారు. గత సోమవారం ఆ బృందం డీజీపీని కలవాలని నిర్ణయించినా టీడీపీ నాయకులెవరూ వెళ్లలేదు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పలువురు నాయకులు కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు తెలుస్తున్నది.

కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, చాలామంది ఆయన, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలిసింది.

వాస్తవానికి గతంలో స్వయంగా చంద్రబాబునాయుడు కోడెలతో ఈ వ్యవహారాలపై మూడు సార్లు హెచ్చరించినట్లు తెలుస్తున్నది. కోడెల కుమారుడు శివరామ్ ను కూడా మూడు సార్లు పిలిపించి హెచ్చరించారని చెబుతున్నారు. కానీ లెక్కచేయలేదు. చివరకు నరసరావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావును నరసరావుపేటలో ఎంపీ కార్యాలయంను కూడా ఏర్పాటు చేసుక్కోలేక పోయారు. అందుకే కోడెలను సమర్థిస్తూ ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడేందుకు ఇప్పుడు ముందుకు రావడంలేదు.