ఆమె నన్ కాదు.. వేశ్య!

క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసు వివాదం మరింత ముదిరింది. ఫ్రాంకోపై లైంగికదాడి ఆరోపణలు చేసిన నన్‌పై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ కొట్టాయంలో మీడియా ముందే నోరు పారేసుకున్నారు.

బిషప్‌పై లైంగికదాడి ఆరోపణలు చేసిన నన్ ఒక వేశ్య. ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నెరుపుతున్న నన్‌ను ఏమని పిలువాలి? 13 సార్లు నన్ను రేప్ చేశాడని ఆమె చెప్తున్నది. మిగిలిన 12 సార్లు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు. 13వ సారికి అది రేప్ ఎలా అవుతుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

నన్ అంటే ఆమె కన్యగా ఉండాలి. తన కన్యత్వాన్ని కోల్పోతే ఇక ఆమెను సన్యాసినిగా పరిగణించలేం అని అసహ్యంగా మాట్లాడారు. పేరు ప్రతిష్ఠలు కలిగిన వ్యక్తులను బద్నాం చేయడానికి మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని విరుచుకు పడ్డారు.

జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సుధీరన్ సహా పలువురు ఖండించారు. కాగా, బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని వివిధ క్యాథలిక్ సంఘాలు, నన్‌లు ఆందోళన నిర్వహించారు. వేశ్య అయినా భయపెట్టో, బలవంతం చేసో, మరో విధంగానో ఆమె అంగీకారం లేకుండా లైంగిక చర్యలకు పాల్పడితే నేరమే అవుతుందని ఈ ప్రజప్రతినిదికి తెలియదా అని అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.