ఏపీకి హోదా ముగిసిన అధ్యాయమే

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే అంశాల కోసం పాటుపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదాపై తన అభిప్రాయాన్ని వెల్లడించానని చెబుతూ ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో ఇవ్వడానికి సిద్ధపడిందని, ఏపీకి ప్యాకేజీ కోసం తానూ పాటు పడ్డానని వెల్లడించారు.

దేశాభివృద్ధికి నరేంద్ర మోదీయే సరైన నాయకుడని నమ్ముతున్నానని, టిడిపి  ఎన్డీయేలో ఉన్న సమయంలో మోదీ కేబినెట్‌లో పనిచేశానని  సుజనా చౌదరి తెలిపారు. బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి ఫిర్యాదు, ఛార్జిషీటూ లేదని.. ఇటీవల వచ్చినవి కూడా అభియోగాలు మాత్రమేనని వివరణ ఇచ్చారు. 

రాజ్యాంగం ప్రకారం అనుమానం వస్తే ఎవరినైనా విచారించవచ్చని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అంటూ 2004లోనే తాను వ్యాపారం నుంచి బయటకు వచ్చానని, వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని స్పష్టం చేశారు.

తాను ఏ పార్టీలో ఉంటే అక్కడ క్రమశిక్షణ కలిగిన ఓ సైనికుడిలా పనిచేశానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపితో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తనతో పాటు మరో ముగ్గురు కూడా బిజెపిలో చేరారని చెబుతూ జాతి నిర్మాణం కోసం బిజెపితో కలిసి పనిచేయాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సుజనా స్పష్టం చేశారు. తమ చేరికతో ఏపీ విభజన చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.