ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కు గాయం

భారత జట్టును గాయాలు నీడలా వెంటాడుతున్నాయి. చేతి వేలి గాయంతో టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఇప్పటికే మెగాటోర్నీకి పూర్తిగా దూరం కాగా, తాజాగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ కోసం బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న శంకర్..యార్కర్ స్పెషలిస్టు జస్ప్రీత్ బుమ్రా విసిరిన బంతికి గాయానికి గురయ్యాడు.

బుల్లెట్ వేగంతో వచ్చిన బంతి శంకర్ కాలికి బలంగా తాకడంతో బాధతో విలవిలలాడిపోయాడు. ఈ కారణంగా గురువారం జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో ఈ తమిళనాడు ఆల్‌రౌండర్ కనిపించినా..బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. కేవలం బేసిక్ డ్రిల్స్‌తో పాటు చెప్పులు ధరించి కొద్దిసేపు పరిగెత్తాడు. అయితే శంకర్ గాయం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. 

ధవన్ గాయంతో దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శంకర్..అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఇమాముల్ హక్, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకమయ్యాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శంకర్ గాయం ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. శనివారం ఆఫ్ఘన్‌తో జరిగే మ్యాచ్‌కు ఈ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.

మరోవంక, టీమ్‌ఇండియా స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన భువీ రెండున్నర ఓవర్లకు పరిమితమై మైదానాన్ని వీడాడు. అయితే ఇంగ్లండ్‌తో ఈనెల 30న జరిగే మ్యాచ్ వరకు భువీ ఫిట్‌నెస్ సాధిస్తాడా అన్నది డౌట్‌గా ఉంది.

గాయం తీవ్రత అధికంగా ఉండి కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంటే భువీని తప్పించే ఆస్కారమున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే స్టాండ్‌బై పేసర్‌గా ఎంపికైన వెటరన్ పేసర్ ఇషాంత్‌శర్మకు బోర్డు నుంచి పిలుపు రావచ్చు.

ఇలా ఉండగా, గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీకి దూరమైన ధవన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. "డియర్ ధవన్..పిచ్ నిన్ను చాలా మిస్సవుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు. గాయం నుంచి త్వరగా కోలుకుంటావనుకుంటున్నాను. మైదానంలోకి దిగి దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించిపెట్టాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మోదీ గురువారం ట్వీట్ చేశారు.