నడ్డా సమక్షంలో బీజేపీలోకి నలుగురు టీడీపీ ఎంపీలు

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం సాయంత్రం ఈ నలుగురు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ అందజేశారు. అనంతరం బీజేపీ వర్కంగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం కండువాలు కప్పిన నడ్డా.. ఆ నలుగురు ఎంపీలను సాదరంగా ఆహ్వానించారు.

దేశంలో విశ్వాసాత్మక రాజకీయాలపై నమ్మకంతోనే టీడీపీ నేతలు బీజేపీలో చేరారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. నలుగురి ఎంపీల చేరికతో ఆంధ్ర ప్రదేశ్‌లో బలపడ్డామని నడ్డా చెబుతూ ఏపీలో బీజేపీ పునాదులు పటిష్ఠమవుతాయని నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి  భూపేంద్రయాదవ్‌ మాట్లాడుతూ.. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల చీలికవర్గం బీజేపీలో విలీనం చేశామని చెప్పారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ తీర్మానం లేఖలు ఇచ్చారని చెప్పారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. 

నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వం నచ్చి, అమిత్‌షా పిలుపునకు స్పందించి సుజనా, సీఎం రమేష్‌, టీజీ, గరికపాటి బీజేపీలో చేరారని పేర్కొన్నారు. పాజిటివ్‌ రాజకీయాలపైనే బీజేపీకి విశ్వాసం ఉందని చెబుతూ సబ్ కా సాత్‌, సబ్‌కా వికాస్‌ మా లక్ష్యమని జేపీ నడ్డా తెలిపారు. ఏపీలో బీజేపీ ఈ నలుగురి రాకతో బలోపేతమైందని.. ఏపీలో బీజేపీ పునాదులు పటిష్ఠమవుతాయని నడ్డా పేర్కొన్నారు.

విభజన హామీలు నెరవేరాలంటే బీజేపీతో కలిసి పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంఘర్షిస్తే ఉపయోగం లేదని అన్నారు. దేశం ఎవరితో ఉందో ఎన్నికలతో తేలిపోయిందన్నారు. అందుకే తాము బీజేపీలో ఉండాలని నిర్ణయించుకున్నామని సుజనా తెలిపారు. హక్కుల కోసం కేంద్రంపై పోరాటమంటూ... టీడీపీ అనుసరించిన ధోరణిని పరోక్షంగా ఆయన గుర్తు చేశారు. సుజనా చౌదరికి మళ్లీ మోదీ కేబినెట్‌లో చోటు దక్కొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.