టిడిపికి షాక్‌..నలుగురు ఎంపీల గుడ్‌బై!

తెలుగు దేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని  వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. 

దీంతో రాజ్యసభలో టిడిపికి బలం రెండుకు పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు. మరోవంక, తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక పరిస్థితుల కారణంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తాము బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు వారు తెలిపారు. 

రాష్ట్రంలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు  చెబుతున్నారు. టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. 

ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పాలని తామెంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని ఎంపీలు అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కేవలం తన కుమారుడు లోకేశ్‌ను భావి నేతగా తీర్చిదిద్దాలన్న స్వార్థంతో పార్టీ పుట్టి ముంచారని ధ్వజమెత్తుతున్నారు. తిరుగులేని మాస్‌ లీడర్‌గా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే వ్యూహలే లేకుండా పోయాయని పేర్కొంటున్నారు.