తెలుగు దేశంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాబల్యం !

నాలుగేళ్ల రాజకీయ వనవాసానికి స్వస్తి పలుకుతూ తిరిగి కాంగ్రెస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి యన్ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తెలుగు దేశం పార్టీ లో చక్రం తిప్పుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని కాంగ్రెస్ లో తన వారికి సీట్లు ఇప్పించుకున్నా వారేట్లాగు గెలిచే అవకాశం లేకపోవడంతో, తన మనుష్యులను వ్యూహాత్మకంగా టిడిపి లోకి పంపి, ఆ పార్టీ సీట్లు ఇప్పించి, గెలిపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ వ్యతిరేక పక్షంగా పురుడు పోసుకున్న తెలుగు దేశం ఒకవంక తెలంగాణలో కాంగ్రెస్ తో బహిరంగంగానే పొత్తు ఏర్పరచు కోవడానికి సిద్దం అవుతూ ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లో అటువంటి పొత్తు లేక పోయినా పలువురు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని, వారికి టిడిపి సీట్లు ఇవ్వడానికి కిరణ్ రంగం సిద్దం చేస్తున్నారు. అందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా సహకరించడాన్ని రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి.

మాజీ మంత్రి కోండ్రు మురళిని టిడిపిలో చేర్చుకోవడం ఈ సందర్భంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితునిగా పేరొందారు. టిడిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్న, ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యురాలైన ప్రతిభ భారతి అందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబునాయుడు లెక్క చేయక పోవడం గమనార్హం.

అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరే ముందే తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని  తెలుగు దేశం పార్టీలో చేర్పించడమే కాకుండా, అధికార పదవి వచ్చేటట్లు కుడా చేసారు.  వచ్చే ఎన్నికలలో పార్టీ సీట్ కు కుడా హామీ ఇచ్చారు. ఆ విధంగా మరి కొందరు కాంగ్రెస్ నేతలను టిడిపిలోకి పంపడానికి కిరణ్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

వై ఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన కిరణ్ కుమార్ రెడ్డి కుడా చంద్రబాబునాయుడు స్వస్థలమైన చిత్తూర్ జిల్లాకు చెందిన వారే. ఆ జిల్లలో వై ఎస్ నమ్మిన భంటు కావడంతో తొలి నుండి చంద్రబాబుతో అసలు పదేడిది కాదు. అయితే 2009 ఎన్నికల అనంతరం ఆర్ధిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖ వస్తుందని ఎదురు చుసిన కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వక పోగా, కాంగ్రెస్ లో తన ప్రత్యర్ధి, తనను ఓడించడానికి తీవ్ర ప్రయత్నం చేసారని భావిస్తున్న పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సహించలేక పోయారు.

కొడుకు జగన్ మోహన్ రెడ్డి వత్తిడితో రామచంద్రరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన వై ఎస్ కిరణ్ కుమార్ రెడ్డిని సముదాయించడం కోసం  మంత్రివర్గం ఏర్పాటు రోజునే ఆయనను స్పీకర్ చేస్తున్నట్లు ప్రకటించారు. దానిని సహించలేని కిరణ్ అప్పటి నుండి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడుతో స్నేహం చేయడం ప్రారంభించారు. ప్రతిపక్ష నేత సభలో ఎంత సేపు ప్రభుత్వాన్ని ఎండగడుతూ మాట్లాడినా అనుమతి ఇచ్చేవారు. కాని కాంగ్రెస్ మంత్రులకు సమాధానం చెప్పడానికి మాత్రం అవకాశం ఇచ్చేవారు కారు.

వైఎస్ మృతి తర్వాత జగన్ మోహన్ రెడ్డి, సోనియా గాంధీల మధ్య దూరం పెంచడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర వహించారు. ఆయనను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాతనే ఇక కాంగ్రెస్ లో తనకు ఎటువంటి ప్రాముఖ్యత లభించదని నిర్ధారణకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చి మరో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తెలిసిందే.  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహితం కీలక రాజకీయ అంశాలలో చంద్రబాబునాయుడును సంప్రదిస్తూ ఉండేవారు. పయ్యావుల కేశవ్ వంటి టిడిపి శాసన సభ్యులు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి, తమ ఫోన్ ల ద్వారా చంద్రబాబునాయుడుతో మాట్లాడించే వారు.

జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీ కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగు దేశంమే ఆదుకోవడం గమనార్హం. అందుకు క్రుతజ్ఞతగానే చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందించారు. ఆ పరిచయం, స్నేహాన్ని ఉపయోగించే ఇపుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు దేశంలో కూడా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబును ఒప్పించడంలో సహితం కిరణ్ తన వంతు పాత్ర వహించారని చెబుతున్నారు. తెలుగు దేశంలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నవారు ఈ పొత్తును తట్టుకోలేరని గ్రహించిన చంద్రబాబు కాంగ్రెస్ పూర్వరంగం గలవారికి ఎక్కువగా సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీలో అసమ్మతి లేకుండా చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ లోనే రాజకీయాలు ప్రారంభించిన చంద్రబాబునాయుడు తొలినుండి కాంగ్రెస్ వారి సాన్నిహిత్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు దేశంలో వీలును బట్టి పలు కాంగ్రెస్ నాయకులను తీసుకు వస్తూ, వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారు.