అర్ధరాత్రి లాఠీచార్జ్ లో ఎమ్యెల్యే రాజాసింగ్ కు గాయం

హైదరాబాద్ లోని పాతబస్తీలోని గత అర్ధరాత్రి పోలీసులు జరిపినలాఠీచార్జ్ లో బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ గాయాలకు గురయ్యారు.రాజాసింగ్‌ తలకు గాయాలవడంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

జుమ్మెరాత్ బజార్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వాతంత్య్ర సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా రాజాసింగ్ అక్కడికి చేరుకున్నారు. 

అనుమతి లేకుండా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించవద్దని అంటూ పోలీసులు అడ్డుకున్నారు.  ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు గాయాలయ్యాయి. పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు.

అన్యాయంగా తమపై పోలీసులు దాడి చేశారని, దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే దాడి చేస్తారా అని పోలీసులపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ ఖండించారు. రాజాసింగ్ ను పరామర్శించి పోలీసులు, ఎంఐఎం కుమ్ముక్కై చేస్తున్నారని ఆరోపించారు.