పోలవరంలో జగన్ కు సవాల్ కానున్న పునరావాసం

తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో అవసరమైన అనుమతులన్నీ తీసుకొచ్చి, చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ ను తన హయాంలోనే పూర్తిచేసే, తానే ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నా ఈ సందర్భంగా పలు పెను సవాళ్ళను ఎదుర్కొనక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రాజెక్ట్ పనులు 70 శాతం మేరకు పూర్తిచేసిన్నట్లు చెప్పుకొంటున్న అసలు సమస్య పునరావాసం. ఈ విషయంలో గత ప్రభుత్వం చెప్పుకోదగిన కృషి చేయనే లేదు. 

25 శాతం కన్నా తక్కువ పూర్తయిన పనులను ఆపివేయాలని జగన్ ఇచ్చిన ఆదేశాలు పునరావాసానికి కూడా వర్తిస్తాయా అన్నది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. తమ అనుమానాలను నివృత్తి చేయాలని ఆ శాఖ అధికారులు ఆర్ధికశాఖను ఆశ్రయించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నప్పటికీ, పునరావాసం పూర్తికానిదే ప్రాజెక్టు ఫలితాలు రైతులకు, ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి వుండదు. ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల వారిని తరలించి వేరే ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకుకే కాలనీలను ప్రారంభించారు. 

అయితే ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాలనీల నిర్మాణం మాత్రం వేగవంతం కావడం లేదు. నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్న మేరకు 25 శాతం నిబంధన కారణంగా దాదాపు 90 శాతం వరకు పనులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. 

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 15,261 ప్రాజెక్టు బాధిత కుటుంబాల కోసం 48 కాలనీలు వివిధ ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రామన్న గూడెంలోని ఒక కాలనీ నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభం కాకపోగా, మిగిలిన 47 కాలనీల నిర్మాణం ప్రారంభమైనా వాటిల్లో ఇప్పటికీ 40 కాలనీల నిర్మాణం 25 (ఖర్చు పరంగా) శాతానికి మించి జారగనే లేదు. 

వీటిల్లో తూర్పు గోదావరి జిల్లాలో 14, పశ్చిమ గోదావరి జిల్లాలో 26 కాలనీలు ఉన్నాయి. కాలనీల నిర్మాణంలో ఆర్ధికంగా జరిగిన ప్రగతిని పరిశీలిస్తే రూ.488 కోట్లు విలువగల ఇళ్ల నిర్మాణం, రూ.1,290 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మొత్తం రూ.1,778 కోట్లతో నిర్వహించాల్సి ఉంది. అయితే కేవలం రూ.241 కోట్ల  విలవైన పనులు మాత్రమే జరిగాయి. ఇందులో ఇళ్లకు రూ.177 కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.46 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 

బాధిత కుటుంబాలను గుర్తించడం, ఇళ్ల ప్లాన్‌లను సిద్ధం చేయడం, ట్విన్‌ హౌసెస్‌ గుర్తింపు, సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లుల చెల్లింపు, ఆర్ధికశాఖ అనుమతి రాకపోవడం, ఫిబ్రవరి నుంచి  బిల్లులకు నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలే కాలనీల నిర్మాణంలో జాప్యానికి కారణంగా చెబుతున్నారు.