జమిలి ఎన్నికలకు మెజారిటీ పార్టీల మద్దతు

జమిలి ఎన్నికలపై సూచనలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక కమిటీని నియమించనున్నారు. లోక్‌సభకు,రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలపై ఈ కమిటీ నిర్దేశిత గడువులోగా సూచనలు అందజేయనుంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం పలు రాజకీయ పక్షాల నేతలను కలుసుకున్నారు. జమిలి ఎన్నికలతోపాటు, ఈ ఏడాది జరుగనున్న మహాత్మాగాంధీ 150వ జయంతి, 2022లో జరుగనున్న భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలపై ఆయన వారితో చర్చలు జరిపారు.

పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను ప్రధాని ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమావేశం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు టీఆర్‌ఎస్, బీజేడీ సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన సీపీఎం, సీపీఐ పార్టీలు జమిలి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి తప్ప తమ ప్రతిపాదనను వ్యతిరేకించలేదని చెప్పారు. 

సంబంధిత పక్షాలతో మాట్లాడిన తరువాత ప్రధాని ఆ కమిటీని ఏర్పాటు చేస్తారని, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు దానికి నిర్దిష్ట గడువు విధిస్తారని రాజ్‌నాథ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి డీ రాజా, బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్‌కుమార్, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, ఎన్‌పీపీ నాయకుడు కాన్రాడ్ సంగ్మా హాజరయ్యారు. 

పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో లా కమిషన్.. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు ఒక ముసాయిదాను కేంద్రానికి అందజేసింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగం పరిధిలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కూడా లా కమిషన్ తెలిపింది.

జమిలి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరు కాలేదు. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.