లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి. బుధవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నిక జరిగింది. ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, గడ్కరీ బలపరిచారు.

స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ తదితరులు సభాస్థానం వరకూ తోడ్కొని వెళ్లగా బిర్లా స్పీకర్‌ స్థానంలో ఆసీనులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు గల్లా జయదేవ్‌, నామా నాగేశ్వరరావు, మిథురెడ్డి తదితరులు సభాపతి స్థానం వద్దకు వెళ్లి బిర్లాకు అభినందనలు తెలిపారు. స్పీకర్‌ స్థానంలో ఓం బిర్లా ఆశీనులవుతున్న సమయంలో ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ సభ్యులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మట్లాడుతూ.. స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నిక లోక్‌సభకు గర్వకారణమని చెప్పారు. ఓం బిర్లా రాజస్థాన్‌లో బాగా పనిచేసిన విషయం చాలా మంది ఎంపీలకు తెలుసని పేర్కొంటూ  సుదీర్ఘ కాలం పాటు ఆయనతో కలిసి పనిచేశానని వెల్లడించారు. మినీ ఇండియాగా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆయన నిర్విరామంగా సమాజసేవలో నిమగ్నమయ్యారని ప్రశంసించారు.

సభను నిష్పక్షపాతంగా నడుపుతానని.. అందుకు తనకు ప్రతిఒక్కరూ సహకరించాలని నూతనంగా ఎన్నికయిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. సభను నియమ నిబంధనలకు అనుగుణంగా నడుపుతానని హామీ ఇచ్చారు. పార్టీల బలాబలాలకతీతంగా సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సభను నడుపుతానని వ్యాఖ్యానించారు.

ప్రజలకు పారదర్శక పాలన అందించడంతో ప్రధాని మోదీ కృతకృత్యులయ్యారని బిర్లా ప్రశంసించారు. అలాగే 17వ లోక్‌సభలోనూ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభలో ప్రతిఒక్కరి సమస్యలను విని వారికి సావధానంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. సభను సజావుగా నడిపేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సమయం వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలను మాత్రమే సభలో ప్రస్తావించాలని కోరారు.