అక్రమాస్తుల కేసులో వైఎస్ భారతి !

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసులో మొదటిసారిగా ఆయన సతీమణి వైఎస్ భారతి పేరు చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తున్నది. రాజకీయ లబ్దికోసం జగన్ పై అవినీతి కేసులను నీరు కార్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నదని ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారానికి పసలేదని వెల్లడైనది.

మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. జగన్ కంపెనీ అయిన భారతీ సిమెంట్స్‌లో ‘క్విడ్‌ప్రో కో’ పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారం కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్నారు. భారతి సిమెంట్స్‌లో మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది.