వంద రోజుల ప్రణాళికకు ప్రధాని తుది రూపం

రెండోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ సర్కార్..ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు ఉద్యోగ కల్పన ప్రత్యేక ఎజెండాగా రూపొందించిన వంద రోజుల ప్రణాళికకు తుది రూపం ఇవ్వబోతున్నది. ఇందుకు సంబంధించి మంగళవారం కీలక రంగాలకు చెందిన కార్యదర్శులు, పలువురు మంత్రులతో మోదీ సమావేశమయ్యారు. 

ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు కార్యదర్శులు, కీలక మంత్రులతోపాటు నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు కూడా హాజరైనట్లు ప్రభు త్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఐదేండ్లకాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

వీటిలో ప్రముఖంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, పీఎం-కిసాన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ప్రతి ఒక్కరికి శుభ్రమైన నీటి, విద్యుత్ సరఫరాదానిపై కూడా చర్చించారు. అలాగే సులభతర వాణిజ్య విధానంలో భారత్ ర్యాంక్ మెరుగుపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి డిపార్ట్‌మెంట్ తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని చర్చించారు. 

గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదేండ్ల కనిష్ఠ స్థాయి 6.8 శాతానికి పడిపోయిన వృద్ధిరేటును మళ్లీ పుంజుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని దృష్టి సారించారు. వచ్చే నెల 5న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ కంటే ముందు జరిగిన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, మరోవైపు ఈ నెల 22న ప్రధాని ఆర్థిక వేత్తలు, పలు రంగాలకు చెందిన విశ్లేషకులతో సమావేశం కాబోతున్నారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి పలువురు మంత్రులు కూడా హాజరుకాబోతున్నారు.