లోక్‌సభ తదుపరి స్పీకర్‌గా ఓం బిర్లా!

పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌లోని కోటా ఎంపీ ఓం బిర్లా పేరును ఖరారు చేస్తూ బిజెపి ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోంది. ఈ పదవికి పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రచారంలో ఉండగా, రెండో సారి మాత్రమే  లోక్ సభ కు ఎంపికైన ఆయనను ఎంపిక చేయడం ముద్వారా పార్టీలో తరం మార్పుకు సంబంధించి స్ఫష్టమైన సంకేతం ఇచ్చింది. 

 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. బుధవారం .  స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు.

బిర్లా కోటా నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నరైన్‌ మీనాపై బిర్లా విజయం సాధించారు.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు కూడా సన్నిహితుడిగా పేరొందారు. బీజేపీకి యువజన విభాగం యువమోర్చకు ఆరేళ్లపాటు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 

వికలాంగులకు, నిస్సహాయ మహిళలకు సహాకారం అందించడం ద్వారా సామాజిక సేవా కార్యాక్రమాలలో విశేషంగా పాల్గొన్నారు. 2001లో గుజరాత్ లో భూకంపం సందర్భంగా వైద్యులతో సహా వందమంది బృందంతో వెళ్లి వైద్య సహాయం అందించారు. అయోధ్య ఉద్యమంలో జైలుకు వెళ్లారు. 

హిమాచల్ ప్రదేశ్ తర్వాత అత్యధికంగా 58.47 శాతం ఓట్లతో రాష్ట్రంలో అన్ని లోక్ సభ స్థానాలను బిజెపి గెల్చుకోంది. అందుకనే ఈ రాష్ట్రం నుండి ముగ్గురిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోగా ఇప్పుడు నాలుగోవారిని స్పీకర్ పదవి అలంకరించనుంది.