కెసిఆర్ పై పెదవి విప్పని చంద్రబాబు

కెసిఆర్ పాలన నుండి తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధర్యంలో `మహాకుటమి’ ఏర్పాటు చేయాలని ఒకవంక ప్రయత్నం జరుగుతున్నది. టీఆర్ఎస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా తమ మూల రాజకీయ విధానాలను ఆటకేక్కించి కాంగ్రెస్ తో చేతులు కలుపడానికి సిద్దపడుతున్నట్లు తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీకి జరుగబోయే ఎన్నికలలో టీఆర్ఎస్‌ కేంద్ర బిందువు కానున్నది. ఆ పార్టీకి అనుకులంగానో, వ్యతిరేకంగానో అన్ని పార్టీలు సమీకృతం అవుతున్నాయి.

అయితే ఈ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసం శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఇక్కడ అధికార పక్షాన్ని గాని, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ను గాని ఒక్క మాట కుడా అనలేదు. పైగా, తనకు, కెసిఆర్ కు మధ్య తగాదాలు పెట్టె ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోడీ చేసారని కేంద్రంపై విమర్శలు కురిపించారు. అంటే తామిద్దరం `మంచి స్నేహితులం’ అన్నట్లు వ్యవహరించారు.

వచ్చే ఎన్నికలు నాలుగేళ్ల కెసిఆర్ పాలనపై ప్రజల తీర్పుగా జరుగనున్నాయి. అయినా కెసిఆర్ పాలన గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా అనలేదు. గతంలో, 14 ఏళ్ళ క్రితం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఘనంగా చేసామని చెప్పుకొచ్చారు. అంతేగాని, ఆ తర్వాత జరిగిన పదేళ్ళ కాంగ్రెస్ పాలనను గాని, నాలుగేళ్ళుగా జరుగుతున్నా కేసిర్ పాలనను గాని మాటవరుసకు కుడా ప్రస్తావించనే లేదు.

తన ప్రసంగం అంతా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు ఆయన చేస్తున్న అన్యయాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. ఇప్పుడు జరుగనున్నవి అసెంబ్లీ ఎన్నికలా లేదా లోక్ సభ ఎన్నికలా అని చాలామందికి అనుమానం వచ్చింది. కెసిఆర్ ను ఓడించడం కోసమే టిడిపి, ఇతర పార్టీలతో `మహాకుటమి’ ఏర్పాటు చేయాలి అనుకొంటున్నామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసారు. కాని ప్రజల ఆశయం మేరకు తెలంగాణా పార్టీ శాఖ నిర్ణయం తీసుకొంటుందని, దానికి తాను ఆమోదం తెలుపుతామని మాత్రమే చంద్రబాబు చెప్పారు.

నోట్లకు వోట్ కేసులో తనను కెసిఆర్ ఇరికిస్తారనే భయంతోనే హైదరాబాద్ నుండి అమరావతికి చంద్రబాబు హడావుడిగా మకాం అమర్చారని అందరికి తెలిసిందే. ఆ భయంతోనే కేసిర్ పాలన గురించి ప్రస్తావించడానికి సహితం భయపడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రసంగం సహితం అటువంటి అనుమానాలకు బలం చేకూరేటట్లుగా ఉన్నది.

 గత సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సహితం చంద్రబాబు అధికార పక్షంపై ఒక్క మాట కుడా అనక పోవడంతో, పార్టీ అధినేతే భయపడుతుంటే మనం ఎందుకు ఇక్కడ ప్రభుత్వంపు ఆగ్రహానికి గురి కావాలనే టిడిపి మద్దతుగా ఉండే పలు వర్గాలు అసలు వోటింగ్ లో పాల్గొనక పోవడం జరిగింది. దానితో నగరంలో ఒక్క డివిజన్ ను కుడా టిడిపి గెల్చుకోలేక పోయింది.

ఇప్పుడు కుడా చంద్రబాబు ప్రసంగంలో `పలాయనవాదం’ వ్యక్తం అవుతున్నట్లు టిడిపి వర్గాలే భావిస్తున్నాయి. దానితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఒకటి, రెండు సభలలో తప్ప చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉండక పోవచ్చనే సంకేతం వెడుతున్నది.