ఇసుక తవ్వకాల బంద్‌తో కుదేలైన నిర్మాణ రంగం

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటిస్తామంటూ ఇసుక తవ్వకాలను నిలిపేయడంతో నిర్మాణ రంగం స్తంభించి పోతుంది. నిర్మాణ పనులకు ఉపయోగించే వాటిలో ఇసుకే ప్రధానం కావడంతో ఇసుక లేక నిర్మాణ పనులను భవన యజమానులు మధ్యలోనే నిలిపివేసుకోవాల్సి వస్తోంది.

ఆ ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడుతోంది. వేసవి కాలంలోనే నిర్మాణ పనులు అధికంగా జరుగుతుంటాయి. ఈ కాలంలోనే ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై ఆంక్షలు పెట్టడంతో సిమెంట్‌, ఇటుక అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కార్మికులపైనే కాకుండా వ్యాపారులపైనా ప్రభుత్వ నిర్ణయం ప్రభావం చూపుతోంది.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 20 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా 13 లక్షల క్యూబిక్‌ మీటర్లకుపైగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటాయి. గత ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రకటన చేసినప్పటికీ ఆయా రీచ్‌ల ద్వారా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతూ వచ్చాయి. 

ట్రాక్టర్‌ ఇసుక రూ.ఐదు వేలు వరకూ పలికింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోవడం, ఎవరైనా నిబంధనలు ఉపక్రమిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామంటూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఇసుక కొరత ఏర్పడింది. 

ఇసుక తవ్వకంపై ఆంక్షలు మొదలవ్వడంతో అప్పటి వరకు ఉన్న ఇసుక నిల్వలను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో వ్యాపారులు పడ్డారు. అత్యవసరంగా ఎవరైనా ఇసుక కావాలని వెళితే ట్రాక్టర్‌ ఇసుకను చాటుగా రూ.ఎనిమిది వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

 జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణ పనులు, వివిధ అభివృద్ధి పనులకు జిల్లాలోని నాలుగు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాల నిమిత్తం ఏడు ప్రాజెక్టులకు పది రోజులపాటు అనుమతి ఇవ్వడంతో, ఆ మేరకే ప్రస్త్తుతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జులై ఒకటో తేదీ నుంచి నూతన ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటించే వరకు ఇసుక తవ్వకాలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వం చేసిన ప్రకటన జిల్లాలో సుమారు రెండు లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. రోజువారీ పనులు చేసుకుని పొట్టపోసుకునే భవన నిర్మాణరంగ కార్మికులలో ఎక్కువ శాతం మంది ఇప్పటికే ఇసుక కొరతతో పనులు లేక రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. 

నూతన ఇసుక పాలసీ వెలువడే వరకూ ఇక్క విజయవాడ నగరంలోనే నిర్మాణ పనులు ఆగిపోయి 60 వేల మంది వరకు కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నిబంధనల మేరకైనా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కార్మికులు, భవన నిర్మాణదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.