ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌  కు ఎదురైన ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ మసిపూసి మారేడుకాయ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా  కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ఎంత? ఫలితాలు ఏ మేరకు ఉంటాయి? ఎన్ని లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందనే విషయాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

ప్రజల సొమ్ముకు సంబంధించి ప్రతి పైసాకు లెక్క చెప్పాలని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. లంబాడా తండా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డీఎస్‌ వెంకన్నతో పాటు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు   టీఆర్‌ఎస్‌ , కాంగ్రెస్‌ పార్టీ నేతలు బిజెపిలో చేరారు. బిజెపి  రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం కబంద హస్తాల నుంచి విముక్తి చేసే సత్తా ఒక్క బిజెపికే ఉందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. జులై 6 నుంచి ప్రారంభించే బిజెపి సభ్యత్వ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అదనంగా 5 లక్షల మంది సభ్యులను చేర్పించే దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు. డిసెంబరు వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 22న జరిగే రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ ప్రక్రియపై చర్చిస్తామని చెప్పారు.