తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలొద్దన్న ఇద్దరు సీఎంలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉండొద్దని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్టు తెలిసింది.  ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజయవాడకు వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దాదాపు గంటన్నరపాటు ఇద్దరు సీఎంలు విభజన సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చలు జరిపారు. 

హైదరాబాద్‌లో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఇద్దరు సీఎంలు చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వరంగసంస్థల విభజనపై దృష్టిపెట్టడంతోపాటు.. విద్యుత్ ఉద్యోగుల విభజనపైనా చర్చించినట్టు తెలిసింది.

ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై సమాలోచనలు జరిపిన సీఎంలు.. కృష్ణా, గోదావరి జలాలపై కోర్టులు, ట్రిబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని నిర్ణయించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను సంపూర్ణంగా వాడుకోవాలని  ఈ సందర్భంగా నిర్ణయించారు. ఏపీలోని ఓడరేవుల ద్వారా తెలంగాణ సరకులను ఎగుమతి చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాల కోసం విమానాల సంఖ్య పెంచాలని భావించారు. ఇరు రాష్ట్రాల మధ్య మరిన్ని రైళ్లు, జాతీయ రహదారుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. రవాణా వసతుల పెంపుదల కోసం కేంద్రానికి ఉమ్మడిగా లేఖ రాయాలని నిర్ణయించారు. 

 ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల చుట్టూ తిరిగినా అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ సరైన ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడంతో పాటు చెక్‌డ్యామ్‌ల వంటివి లేకపోవడం వంటి వాటి వల్ల వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈనెల 24న గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లో ఉంది. ఈ భేటీతో తొలి అడుగు పడుతుందని, ఆ తర్వాత ఇద్దరు సీఎంల సమావేశం జరపాలని నిర్ణయించారు. 

రెండు ప్రభుత్వాలు కలిసి పని చేస్తే కృష్ణా, గోదావరి నీటిని సమర్థంగా వాడుకోవచ్చని ఇద్దరి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉందని, ఓడరేవులు ఉన్నాయని, వీటి ద్వారా ఎగుమతులు సాగుతున్నాయని, వాటిని ముమ్మరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని కేసీఆర్‌ చెప్పారు. తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు జరిగే ఎగుమతుల కోసం ఏపీలోని ఓడరేవులకు తెలంగాణ నుంచి సరకులను పంపిస్తామని ఆయన చెప్పగా.. అందుకు జగన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.  

 విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజన ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలి. ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థల మధ్య సమస్యలపై సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ బకాయిల పరిష్కారం త్వరితగతిన జరగాలని కూడా నిర్ణయించారు.