బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ కేంద్ర మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా (జేపీ నడ్డా) నియమితులయ్యారు. ఈ మేరకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి నడ్డా పేరును ఖరారు చేస్తూ బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నడ్డా (58) గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటి ఎన్నికలలో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు.

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేంద్రములో హోమ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో తిరిగి  కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిపేవరకు ఈ నియామకం జరిపినట్లు తెలుస్తున్నది. త్వరలో జరుగబోయే కీలకమైన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అమిత్ షా సారధ్యం వహించేందుకు వీలుగా కేంద్ర మంత్రివర్గంలో చేరినా పార్టీ అధ్యక్ష బాధ్యతలో కూడా కొనసాగేటట్లు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

వివాదరహితుడిగా పేరొందిన నడ్డా సంస్థాగత వ్యవహారాలలో మంచి అనుభవం ఉంది. ఆయనను తదుపరి పార్టీ అధ్యక్షుడిగా భావిస్తున్నారు. పట్నా, హిమాచల్‌ప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు.