ఏపీలో బలమైన ప్రతిపక్షంగా బిజెపి

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షంగా నిలిచేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధరరావుతెలిపారు. రాష్ట్రంలో వైసిపిని ఎలాంటి పరిస్థితిలోనూ ఇబ్బంది పెట్టకపోయినా తాము ప్రతిపక్షపాత్ర పోషిస్తామని విజయవాడలో వెల్లడించారు. ఏపీలో టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదని అన్ని పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు రాజకీయ మనుగడ లేకుండా పోగలదని మురళీధరరావు జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రధాని మోదీ సహకారంతో వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించులేకపోయారని ధ్వజమెత్తారు. 

తెలంగాణలో రానున్న రోజుల్లో బలమైన శక్తిగా ఏదుగుతామని అంటూ ఇక అక్కడ భవిష్యత్ తమదేనని ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేస్తున్నారు కానీ జాతీయ స్థాయిలో ఏ నేత కూడా ఉత్సాహంగా లేరని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో రాజకీయ మనుగడ కావాలంటే ప్రజలు టీఆర్‌ఎస్ వైపు చూస్తారు... భవిష్యత్ కావాలంటే బీజేపీ వైపు చూస్తారని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మటుమాయం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో 220 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 శాతం ఓట్లు సాధించామని అనేక చోట్ల 62 శాతం ఓట్లు కూడా వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఓటమి చెందినప్పటికీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని భారతదేశ చరిత్రలో సరికొత్త రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుట్టామని వివరించారు. 

ఇక దేశంలో కాంగ్రెస్, వామపక్షాలకు బలంగా ఉన్న చోట్ల ఈ దఫా బీజేపీ ఘనమైన ఓట్లే కాదు సీట్లు కూడా సాధించడం జరిగిందని చెప్పారు. కర్నాటకలో తాము అధికారంలో లేనప్పటికీ ఎక్కువ సీట్లు గెలిచామని, త్రిపుర, బెంగాల్‌లో తమ పార్టీ బలపడిందని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా గతంలో ఎన్నడూ ఓటమి చూడని నేతలు కూడా ఈ దఫా ఓటమి చెందారంటూ, కేరళలో వామపక్షాలకు కాలం చెల్లిందని చెప్పారు.

చాలా చోట్ల 15 శాతం ఓట్లు సాధించామని చెబుతూ దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతున్న పరిస్థితి కన్పిస్తున్నదని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఇక దేశంలో బీజేపీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించబోతున్నామని చెబుతూ జూలై ఆరు నుంచి నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి 20 శాతం పెంచాలని నిర్ణయించామని చెప్పారు.