సజావుగా పార్లమెంట్ సమావేశాలకై ప్రధాని పిలుపు

పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విభేదాలను పక్కనపెట్టాలని వివిధ రాజకీయ పార్టీల నేతలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు రోజు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల భేటీ ఆదివారం జరిగింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బిజెపి రాజ్యసభ పక్షనేత థావర్‌ చంద్‌ గహ్లోత్‌, విపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి విజయసాయిరెడ్డి, గల్లాజయదేవ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మనం ఇక్కడ ప్రజల కోసం ఉన్నాం. పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించడం ద్వారా ప్రజల మన్ననలను పొందలేం. అందుకే విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారు.

2022 నాటికి నవభారత నిర్మాణాన్ని సాధించే దిశగా సభ్యులు తమ సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తే ప్రతి పార్టీ అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. 

సోమవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌తో పాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే తీసుకురానున్నారు. జులై 4న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. 5న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తామని.. ఆ హామీని నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరామని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ సజావుగా జరిగేలా చట్టం తేవాలని, సమావేశాలను అడ్డుకునేవారిపై చట్టబద్ధంగా జీతభత్యాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.

పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశాయని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. విపక్షాల బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో చర్చల సందర్భంగా కొంత ఎక్కువ సమయం కేటాయించాలని కోరామని పేర్కొన్నారు.