మోదీ నిర్ణయిస్తే ఆలయ నిర్మాణం ఎవ్వరూ ఆపలేరు

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరపాలని మోదీ సర్కార్ నిర్ణయిస్తే ఇక ఆపడం ఎవరి తరం కాదని  వసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ధీమా వ్యక్తం చేశారు. అయోధ్యలోని రామ్‌లీల ఆలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు జరిపిన అనంతరం మాట్లాడుతూ   'వివాదం చాలా కాలంగా కోర్టులో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా బలంగా ఉంది. మేమంతా కలిసికట్టుగా ఉన్నాం. రామాలయ నిర్మాణానికి ముందే ఇందుకు అవసరమైన చట్టం తీసుకురావాలన్నదే తమ కోరిక' అని స్పష్టం చేశారు.

అంతకుముందే అక్కడకు చేరుకున్న శివసేన ఎంపీలు స్వాగతం పలికారు. థాకరే వెంట ఆయన కుమారుడు ఆదిత్య థాకరే, ఎంపీ సంజయ్ రౌత్ కూడా అన్నారు. పట్నించి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమవుతున్నందున దీనికి ఒక రోజు ముందే రామ్‌లీలా ఆశీస్సులు పొందేందుకు శివసేన ఎంపీలంతా ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని తాము బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. అయోధ్యకు వీలున్నపుడల్లా రావాలని తనకు ఉంటుందని తెలిపారు.

థాకరే గత ఏడాది నవంబర్‌లోనూ అయోధ్యలో పర్యటించారు. రామాలయ నిర్మాణానికి కేంద్రం ఒక తేదీని ప్రకటించాలని, ఇందుకోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం శనివారం థాకరే పర్యటన గురించి వివరిస్తూ, తమ వరకూ అయోధ్య, రామాలయం అనేవి రాజకీయ అంశాలు కావని, మతం, విశ్వాసాలకు సంబంధించిన అంశాలని చెప్పారు. ఆలయం పేరుతో తాము ఎన్నడూ ఓట్లు అడగలేదని స్పష్టం చేశారు.

రామమందిర నిర్మాణం కోసమే ప్రజలు బిజెపికి అఖండ విజయాన్ని కట్టబెట్టారని చెబుతూ ప్రధాని మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోనే మందిర నిర్మాణం జరిగి తీరుతుందని భరోసా వ్యక్తం చేశారు. ‘‘రామ మందిర నిర్మాణంపై తాము ఎలాంటి ఘనత తీసుకోబోము. గతంలో చెప్పినట్లు మందిర నిర్మాణం మోదీ, ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోనే జరుగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు భారీ విజయం కట్టబెట్టడానికి కారణం కూడా అదే’’ అని సంజయ్‌ తెలిపారు.