19న ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై అఖిల పక్ష భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా కాలం నుంచి వినిపిస్తున్న నినాదం ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలని లోక్‌సభ, రాజ్యసభలలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ నెల 19న ఈ సమావేశం జరుగుతుంది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆదివారం మాట్లాడుతూ ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభలలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానించినట్లు చెప్పారు.

ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణతోపాటు, భారత దేశం 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు,  వెనుకబడిన జిల్లాల అభివృద్ధిగురించి కూడా చర్చింపనున్నారు. 

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, తెరాస అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషి లేఖరాశారు.