2018 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 ఓటర్ల జాబితా ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ స్పష్టంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. 2018 ఓటర్ల జాబితాకు సవరణలు చేస్తామని చెబుతూ సోమవారం ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడిస్తామని ప్రకటించారు.

ఈ జాబితాపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, వాటిమేరకు అవసరమైన మార్పులు, చేర్పులకు ఈ నెల 25 వరకు అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. అక్టోబర్ నాలుగులోపు సవరణలు పూర్తిచేసి, అక్టోబర్ 8న ఓటర్ల సవరణ తుదిజాబితాను ప్రకటిస్తామని చెప్పారు. 2018 జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,53,27,785 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలోనే సవరణలు జరుగుతాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ స్పష్టతనిచ్చింది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఈవో రజత్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఎన్నికలకోసం అన్నీ సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్లు భెల్ కంపెనీ నుంచి వస్తాయని పేర్కొన్నారు. వీటన్నిటినీ భద్రపరిచేందుకు జిల్లాలవారీగా గోదాంలను రెడీ చేసుకోవాలని, అక్కడ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, ఈ విషయాన్ని ఆయా జిల్లాల ఎస్పీలకు వివరాలు అందించాలని కోరారు.

ఇప్పటివరకు ఉన్న పాత ఈవీఎంల రికార్డులను త్వరగా సిద్ధంచేసి నివేదికలు పంపించాలని ఆదేశించారు. కొత్త ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వీవీప్యాట్ల పనితీరుపై రాష్ట్రంలోని ఆరువేల మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని రజత్‌కుమార్ తెలిపారు.