తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం!

తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది. ఆ పార్టీని నమ్ముకొంటే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేము. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం. ఈ మాటలు అన్నది ఎవ్వరో బిజెపి నాయకుడు కాదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. పార్టీ మారే విషయం ఇంకా నిర్ణయించుకోలేదని అంటూ త్వరలో పార్టీ మారనున్నట్లు కూడా సంకేతం ఇచ్చారు. అయితే, కాం గ్రెస్ పట్ల క్యాడర్‌కు నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని, అందుకే నేతలంతా ప్రత్యామ్నయ బిజెపి వైపే చూస్తున్నారని చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కునారిల్లిపోయిందని.. రాష్ట్ర నాయకత్వం తీరే ఇందుకు కారణమని రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడివెళ్తున్నా వారిని రాష్ట్ర నాయకత్వం ఆపలేకపోయిందని, దీనిపై జాతీయ నాయకత్వం కూడా స్పందించలేదని విమర్శించారు. పైగా, జాతీయ స్థాయిలో ఎఐసిసి అధినేత రాహుల్‌గాంధీ నాయకత్వం బలహీనపడిందని పార్టీ నాయకులు భావిస్తున్నారని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో డికె అరుణ లాంటి నాయకులు పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళారనే ఆలోచన చేయకపోవడం శోచనీయమని, ఒకసారి అధిష్టానం ఆలోచించాలంటూ సూచించారు.

నేడు దేశమంతా బిజెపి, ప్రధాని మోదీ వైపు చూస్తోందని తెలిపారు. మోదీ సాహసోపేత నిర్ణయాలకు ప్రజల మద్దతు… దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారని, తద్వారానే రెండో పర్యాయం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో యువత బిజెపి వైపు చూస్తుంది, సరైన సమయంలో నియోజకవర్గ ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు.

తెలంగాణ ఇచ్చినా నాయకత్వ లోపం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌పై పోరాటం చేయడం కాంగ్రెస్‌ వల్ల కాదని స్పష్టం చేశారు. "ఇది పార్టీపై చేస్తున్న విమర్శ కాదు. బాధ, అసంతృప్తి, ఆవేదనతో పార్టీ కార్యకర్తల అభిప్రాయమే నేను చెబుతున్నా. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపినే"  అని పేర్కొన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనితీరుతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదని ధ్వజమెత్తారు. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ప్రజల మధ్య ఉండి పోరాడి విజయం సాధిస్తే.. తెలంగాణలో పీసీసీ చీఫ్ మాత్రం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారని, ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నామని నిప్పులు చెరిగారు. ఈ నాయకత్వంతో నష్టమేతప్ప లాభం లేదని గతంలోనే చెప్పినా అధిష్ఠానం వినిపించుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన తనకు లేదని, దీనిపై భవిష్యత్తులో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు.

ఇలా ఉండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నాయకులు బీజేపీలో చేరుతామంటే తప్పకుండా స్వాగతం పలుకుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని, రాజగోపాల్‌రెడ్డి వాస్తవాలే మాట్లాడారని,   ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే ఆయన చెప్పారని తెలిపారు.