2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే

2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడం సవాళ్లతో కూడుకున్న అంశమైనా సాధ్యమే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. నీతీ ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఐదో సమావేశంకు అధ్యక్షత వహిస్తూ రాష్ట్రాల సమష్టి కృషితో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం’’ అనే మంత్రాన్ని సాకారం చేయడంలో నీతీ ఆయోగ్ పోషించవలసిన పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. పనితీరు, పారదర్శకత, సేవల బట్వాడాలతో కూడిన పరిపాలనా వ్యవస్థ దిశగా మనం సాగుతున్నామన్నారు. నీతీ ఆయోగ్‌లోని ప్రతి ఒక్కరికీ 2022 నాటికి నవ భారతాన్ని సాకారం చేసే సమష్టి లక్ష్యం ఉందని గుర్తు చేశారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఉంటే ఎంతో సాధించవచ్చునని చెప్తూ, దీనికి ఉదాహరణగా, స్వచ్ఛ భారత్ అభియాన్, పీఎం ఆవాస్ యోజనలను ప్రస్తావించారు. ప్రతి భారతీయునికి సాధికారత, సులువైన జీవనం అందుబాటులోకి రావాలని తెలిపారు.

సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడంలో నీతి ఆయోగ్‌ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. ఎన్నికల సమరం పూర్తయ్యిందని, ఇక దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతి రంగానిదే కీలకపాత్ర ఉందని చెబుతూ ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై రాష్ర్టాలు దృష్టి సారించాలని సూచించారు.  జీడీపీ వృద్ధి కోసం జిల్లా స్థాయి నుంచే కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై సమష్టిగా పోరాడాలని సూచించారు. 

మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నాటికి సాధించవలసిన లక్ష్యాలను అక్టోబరు 2కల్లా పూర్తి చేయాలని సూచించారు. భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునే 2022నాటికి సాధించవలసిన లక్ష్యాల సాకారం కోసం కృషిని ప్రారంభించాలని మార్గదర్శనం చేశారు. స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక లక్ష్యాల సాధనకు సమష్టి బాధ్యతపై దృష్టి పెట్టాలని కోరారు. 

నీటి ఎద్దడిని తీర్చేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.  నీటి సంరక్షణ, నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెబుతూ కొత్తగా ఏర్పాటుచేసిన జల్‌శక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేస్తుందని చెప్పారు.  ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతి రంగానిదే ముఖ్య పాత్ర అని, ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలన వల్లే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని మోదీ స్పష్టం చేశారు. 

కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్‌ పాలకమండలి తొలి భేటీ ఇది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు పాల్గొన్నారు.