భారత్‌లో ఉబర్ ఎగిరే ట్యాక్సీలు!

ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్..భారత్‌లో ఎగిరే ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీతో ఉబర్ ఏవియేషన్ ప్రొగ్రాం హెడ్ ఎరిక్ ఆలీసన్, ఉత్పాదన విభాగ హెడ్ నిఖిల్ గోయల్‌లు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న మొబిలిటీ సదస్సులో ప్రత్యేకంగా చర్చించారు. ఎగిరే ట్యాక్సీలు, కార్‌ఫూలింగ్, స్వయంచోధక వాహనాల వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

భారత్‌ను ముందుకుతీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయాలనుకుంటున్నట్లు, విజన్ ఉన్న వ్యక్తియైన మోదీ సారథ్యంలోని భారత్ భవిష్యత్తు ఆశాకిరణం కాబోతున్నదని ఆలీసన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లకాలంలో ఎగిరే ట్యాక్సీలను జపాన్, ఫ్రాన్స్ దేశాలతోపాటు భారత్‌లో కూడా అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రవేశపెట్టేదానిపై ఏబీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉల్రిచ్ స్పీస్స్‌హోఫర్ కూడా మోదీతో చర్చించారు.