ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్ణయం స్థిరంగా ఉందని, హోదాకు సరిసమానమైన సహాయం చేశామని, పునర్విభజన చట్టంలోని అంశాలకు కొన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేశామని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హోదా అంశాన్ని రాజకీయం చేయాలని చూసిందని పేర్కొంటూ కొత్త ప్రభుత్వం అలాకాకుండా ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని తిరుపతిలో హితవు చెప్పారు. కేంద్రం తప్పనిసరిగా రాష్ట్రానికి చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు.
తిరుపతిలో పారిశ్రామిక ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలు, చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రానికి ప్యాకేజీ విషయంలో గత ప్రభుత్వంతో ఎన్నో చర్చలు జరిపిన తర్వాత ఆమోదముద్ర పడిందని, దీన్ని అప్పట్లోని పాలకులు పొగిడారని గుర్తుచేశారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అధ్యయనం చేసి, తదనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.
ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందుందని కితాబిచ్చారు. దీనికి కేంద్రం తగిన సహాయసహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. మానవ వనరుల లభ్యత, సముద్రతీర ప్రాంతం, సాంకేతికతను వినియోగించుకోవడంలో రాష్ట్రం ముందుంది. యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో అవకాశాలున్నాయి. భవిష్యత్తు అంతా వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమలు, సోలార్ ఆధారిత పరిశ్రమలదే. వీటి స్థాపనకు ఏపీ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలపై త్వరలోనే దృష్టి సారిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు కేంద్రం ఎంతో సాయం చేస్తుందని చెబుతూ తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు. ఈ-వాహనాలపై కేంద్ర ప్రభుత్వ పాలసీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
ఆటోమొబైల్ రంగానికి సంబంధించి యాంటీ డంపింగ్ డ్యూటీ పన్ను విధించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు తక్కువ వడ్డీకి రుణాలను అందించేందుకు కేంద్రం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. కియా మోటార్స్ ప్రతినిధులు అప్రోచ్ రోడ్డులోని రైల్వే అండర్ బ్రిడ్జి వెడల్పు పెంచాలని కోరగా, 40 రోజుల్లో దాని పనులు పూర్తి చేయాలని ఆదేశించామని మంత్రి వివరించారు.