కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపులు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కాగా గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయని కిషన్‌రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్ నుంచి అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ మంత్రి సీహెచ్. మల్లారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రసారం చేస్తూ వేధింపులకు పాల్పడుతుండటంతో మంత్రి ఓఎస్‌డీ సుధాకర్‌రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డికి గత కొద్దిరోజుల నుంచి మంత్రికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తున్నట్టు ఆయన పేషీకి వస్తున్న వారిలో కొందరు ఒఎస్‌డి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన సుధాకర్‌రెడ్డి ఆ కథనాలు, వీడియోలు అభ్యంతరకంగా ఉన్నాయని గుర్తించి, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.