మెట్రోరైలులో మహిళలకు ఉచిత ప్రయాణం : శ్రీధరన్ వ్యతిరేకత

రాజధాని నగరం దిల్లీ మెట్రోరైలులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అక్కడి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆ ప్రాజెక్టు రూపకర్త శ్రీధరన్‌ వ్యతిరేకించారు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని ప్రధానిని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రభుత్వ మౌలిక వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదని శ్రీధరన్‌ స్పష్టం చేశారు. 

కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలకు ప్రస్తుతం దిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)లో 50 శాతం చొప్పున భాగస్వామ్యం ఉంది. ఇదే అంశాన్ని శ్రీధరన్‌ తన లేఖలో ప్రస్తావిస్తూ ఇద్దరు భాగస్వాములు ఉన్నప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కుదరదని చెప్పారు. దిల్లీ మెట్రో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శ్రీధరన్‌.. 2011లో ఎండీ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ‘‘ అప్పటి నుంచి దిల్లీ మెట్రో వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనుకున్నాను. కానీ, ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో బయటకు రాక తప్పలేదు’’ అని శ్రీధరన్‌ ఆవేదనతో పేర్కొన్నారు. 

‘‘మెట్రోరైలు తొలి దశ ప్రారంభమైనప్పుడు ప్రయాణికులకు ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. సంస్థకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఇర్ణయం తీసుకున్నాను. కానీ, ఇప్పుడు  రాజకీయ  ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఒక వేళ దిల్లీ మెట్రోరైలులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే.. ఇక దేశంలోని అన్ని మెట్రోరైళ్లలోనూ ఇది అమలు చేయాల్సిన అవసరం రావొచ్చు’’ అని మోదీకి రాసిన లేఖలో శ్రీధరన్‌ పేర్కొన్నారు.